Begin typing your search above and press return to search.

పొలం మ‌న జీవన విధానం.. న‌మ‌స్తే మ‌న జీవ‌న సంస్కృతి

By:  Tupaki Desk   |   25 March 2023 3:21 PM
పొలం మ‌న జీవన విధానం.. న‌మ‌స్తే మ‌న జీవ‌న సంస్కృతి
X
ఆస్కార్ - గోల్డెన్ గ్లోబ్- HCA లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ పుర‌స్కారాల‌తో ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమా నుంచి 'నాటు నాటు..' పాట సాధించిన ఘ‌న‌త ఇది. ఈ పాట‌ను సృజించిన ర‌చ‌యిత చంద్ర‌బోస్. ఒక సీనియ‌ర్ గీత ర‌చ‌యిత‌గా ఆయ‌నకు ద‌క్కిన స‌ముచిత గౌర‌వ‌మిది. స‌గ‌ర్వంగా ఆస్కార్ ని భార‌త‌దేశానికి కానుక‌గా అందించారు. ఈ ఆనందాన్ని మీడియాతోను పంచుకున్నారు. అమెరికా లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేట‌ర్ లో ఆస్కార్ ఉత్స‌వాల్లో లిరిసిస్ట్ చంద్ర‌బోస్ స‌హా ఆర్.ఆర్.ఆర్ టీమ్ పాల్గొంది. ఇటీవ‌లే ఆస్కార్ ల‌తో ఇండియాలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం చంద్ర‌బోస్ ఆస్కార్ గెలుచుకున్న ఆనందంలో త‌న మూలాల‌ను వెతుక్కుంటూ వెళ్లి త‌న కెరీర్ ఆరంభ‌మైన చోట ప్ర‌ముఖుల‌ను క‌లిసి నేటి ఈ విజ‌యానికి కార‌కులైన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో డి.సురేష్ బాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా 'తాజ్ మహల్' సినిమాతో తనకు పాటల రచయతగా అవకాశం ఇచ్చిన రామానాయుడును తలుచుకొని తన మూలాలు గుర్తు చేసుకున్నారు.

చంద్రబోస్.. తనకు రచయతగా తొలి అవకాశం ఇచ్చిన వారిని గుర్తు పెట్టుకొని వారిని తలుచుకోవడంపై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బోస్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. ''95 ఏళ్ల ఆస్కార్ చ‌రిత్ర‌లో ఈ వేదికపై ఎన్నో ల‌క్ష‌ల‌ ఆంగ్ల ప‌దాల‌ను ఉచ్ఛ‌రించారు.

కానీ తెలుగులో మార్మోగిన మొద‌టి ప‌దం -న‌మ‌స్తే. ప్ర‌ద‌ర్శించిన పాట‌లోని ప‌దం పొలం. పొలం మ‌న జీవన విధానం. న‌మ‌స్తే మ‌న జీవ‌న సంస్కృతి. వీటిని ప్ర‌పంచానికి అందించే అవ‌కాశం నాకు ల‌భించింది..'' అని అన్నారు.

ఆర్‌.ఆర్.ఆర్ (RRR) 'నాటు నాటు..' కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు ద‌క్క‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరాలో సంబ‌రాలు మిన్నంటాయి. దేశ వ్యాప్తంగా ప్రజలందరు పండగ చేసుకున్నారు. చంద్ర‌బోస్ - కాల భైర‌వ‌- కీర‌వాణి- ప్రేమ్ ర‌క్షిత్ బృందాన్ని ప్ర‌శంసించారు. అన్నిటికీ ఆది గురువు జ‌క్క‌న్న‌పైనా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

త‌దుప‌రి మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీకి సీనియ‌ర్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ సాహిత్యం అందిస్తార‌ని అంతా భావిస్తున్నారు. మ‌రోసారి ఆస్కార్ కంటెస్టెంట్స్ గా చంద్ర‌బోస్-కీర‌వాణి- రాజ‌మౌళిని చూడ‌బోతున్నామ‌ని ప్ర‌జ‌లు ఊహిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.