చంద్రబాబు తీరుతో 'ఎన్టీఆర్' కు చిక్కులు!

Fri Nov 02 2018 13:15:06 GMT+0530 (IST)

Chandrababu Naidu Alliance with Congress Party Effect on NTR Biopic

తెలుగు ప్రజల అభిమాన నటుడు - దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్'. స్వయంగా ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. వచ్చే ఏడాది ఆరంభంలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. అయితే టీడీపీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుతో ఎన్టీఆర్ చిత్రం చిక్కుల్లో పడుతున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ కు ఆయన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనేది బహిరంగ రహస్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఎన్టీఆర్ సీఎం పదవిని కోల్పోవడానికి - తీవ్ర మానసిక క్షోభ అనుభవించి చివరకు ప్రాణాలొదలడానికి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రే కారణమని వారు విశ్లేషిస్తుంటారు. అయితే - ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య ఆది నుంచి బావతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. తన కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఇంటికే కోడల్ని చేశాడు. ఇప్పుడు టీడీపీ తరఫున హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు వెన్నుపోటు ప్రస్తావన ఉండబోదన్నది సుస్పష్టం. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు.

అయితే చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ తో స్నేహం కుదుర్చుకోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు సమస్యలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు అంశాలను పెట్టలేరు కాబట్టి.. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ గళమెత్తిన తీరును ఇప్పటివరకు సినిమా షూటింగ్ లో బాగా హైలైట్ చేశారట. నాదెండ్ల ఎపిసోడ్ వంటి సన్నివేశాలను రసవత్తరంగా చిత్రీకరించారట. అందుకే ఇప్పుడు చంద్రబాబు హస్తానికి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో బాలయ్య - క్రిష్ తలలు పట్టుకోవాల్సి వస్తోందట.

కాంగ్రెస్ ను విలన్ గా చూపిస్తూ ఇప్పటివరకు తీసిన సన్నివేశాలను యథాతథంగా సినిమాలో ఉంచితే రాష్ట్రంలో - కేంద్రంలో టీడీపీ-కాంగ్రెస్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశముంటుంది. కాబట్టి ఆ సన్నివేశాలను తొలగించి.. కాంగ్రెస్ ను సాఫ్టీ విలన్ గా మాత్రమే చూపించాలని ఎన్టీఆర్ - క్రిష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు వెన్నుపోటు విషయాలు లేకపోవడమే సినిమాకు పెద్ద మైనస్ అని.. ఇప్పుడు కాంగ్రెస్ పై కూడా మెతక వైఖరి చూపిస్తే సినిమా చప్పగా సాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ పుట్టుకలోనే కాంగ్రెస్ వ్యతిరేకత ఉందని వారు చెబుతున్నారు. దుష్ట కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పై టీడీపీ విరుచుకుపడిన తీరే ఆయన్ను తెలుగు ప్రజల్లో రాజకీయ హీరోగా నిలబెట్టిందని సూచిస్తున్నారు. బయోపిక్ లో అలాంటివి లేకపోతే ప్రజలకు చిత్రం రుచించదని హెచ్చరిస్తున్నారు.