తెలుగు తేజం అంబటి రాయుడు బయోపిక్

Sun Dec 08 2019 23:00:02 GMT+0530 (IST)

Chances For Biopic on Ambati Rayudu

అంబటి రాయుడు.. ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరు. మధ్య తరగతి కుటుంబం నుంచి టీమిండియాకు ఎంపికైన ఆటగాడు. క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న అతడిపై  ఎన్నో రాజకీయ కుట్రలు బయటపడ్డాయి. ఓ సాధారణ యువకుడు.. పోలాలు గట్టు పుట్టల్లో తిరుగాడిన యువకుడు... ఒక వ్యయసాయ కూలీ కొడుకు. ఆటగాడిగా అతడి జీవితం తెరిచి ఉంచిన పుస్తకం. రాయుడు మంచి తెలివైన విద్యార్థి కూడా. చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్. అయితే అతనిలో అంతే యాంగర్ మేన్ దాగి ఉన్నాడు. తప్పును క్షమించే టైప్ కాదు. తప్పు జరిగితే ప్రశ్నించే వ్యక్తిత్వం తనకే చెల్లింది. అంతకుమించి ఆత్మాభిమానం కలవాడు. ఆటగాడిగా అతని కెరీర్ ను వెనక్కి నెట్టడంలో అదీ ఓ కారణం అన్న విశ్లేషణలు సాగాయి. ఇలా రాయుడు పుట్టిన నాటి నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఎంపికయ్యే వారకూ తన జర్నీలో ఎంతో ఎమోషన్ దాగి ఉంది.అతను స్టార్ క్రికెటర్ అయినప్పటికీ చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తాడు. విదేశాల్లో క్రికెట్ ఆడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో  ల్యాండ్ అయ్యే సరికి అభిమానులు ఘనంగా  స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నా.. అవన్నీ నచ్చని రాయుడు దొడ్డు దారిలో కారెక్కి ఇంటికెళ్లిపోయేవాడు.  బ్యానర్లు.. ప్లెక్సీలు .. కటౌట్లు అంటే మండిపడతాడు. క్రికెట్ తర్వాత సాధారణ జీవితాన్నే ఇష్టపడే స్వభావి. సెలబ్రిటీ లైప్ ని  కొరుకునే వాడు కాదు. పిల్లలు పుడితే ప్రభుత్వ బడిలోనే చదివాస్తానని.. ఏసీ రూమ్ లో జీవితం అసలు జీవితమే కాదని ఓ ఇంటర్వూలో వెల్లడించాడు రాయుడు.

పరిశీలిస్తే ఇలా అడుగడుగునా రాయుడు జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. అంతకుమించిన  ఎమోషన్ అతడిలో ఉంది. రాయుడు కథని వెండితెరకెక్కిస్తే అదో సంచలనమే. ఎం.ఎస్.ధోనీని మించిన ఎమోషన్ అతడి కెరీర్ ఆద్యంతం ఉంది. అదో సంచలనమే అవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటివరకూ చాలా మంది క్రికెటర్లు జీవిత కథలు తెరకెక్కాయి. వాటితో పోలిస్తే రాయుడు జీవితం పూర్తిగా విభిన్నం. గల్లీ నుంచి దిల్లీవరకూ ఎదిగిన వాడు. ఆటతో వెలిగినవాడు. అదీ తెలుగు వాడు కాబట్టి  క్రికెట్ కు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఎమోషనల్ బయోపిక్ గా ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి టాలీవుడ్ లో ఆ ప్రయత్నం ఎవరు చేస్తారో? ఏ దర్శక హీరో ఆ అవకాశం  తీసుకుంటారో చూడాలి.