Begin typing your search above and press return to search.

థియేటర్ లో రిలీజ్ రోజే కొత్త సినిమా ఇంట్లో టీవీలో?

By:  Tupaki Desk   |   30 May 2023 8:57 PM GMT
థియేటర్ లో రిలీజ్ రోజే కొత్త సినిమా ఇంట్లో టీవీలో?
X
వినోద‌రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. పెద్ద‌తెర - బుల్లితెర‌కు పోటీగా ఓటీటీ రాజ్య‌మేలుతోంది. మునుముందు డైరెక్ట్ టు హోమ్ ప్లాన్ వ‌ర్క‌వుట్ కానుంది. ఇంత‌లోనే ఆంధ్రప్రదేశ్‌లోని సినీ అభిమానులకు ఏ.పీ.ఎస్‌.ఎఫ్‌.ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌) సంస్థ శుభవార్త చెప్పింది. ఇకపై ప్ర‌భుత్వ రంగానికి చెందిన‌ ఫైబర్‌ నెట్‌ సదుపాయం కలిగిన వారు ఇంట్లో కూర్చొనే కొత్త సినిమాలు చూసే అవ‌కావం క‌ల్పిస్తున్నామ‌ని స‌ద‌రు సంస్థ వెల్ల‌డించింది.

థియేట‌ర్ లో రిలీజ్ రోజే కొత్త సినిమాల్ని మొద‌టి రోజు మొద‌టి షో ఇంట్లోనే కూచుని టీవీల్లో చూసే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఛైర్మన్‌ గౌతమ్ రెడ్డి తెలిపారు. అయితే ఇలా కొత్త సినిమాలు చూడాల‌నుకుంటే నెలకొకసారి కాకుండా రొజుకొకసారి రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వినోదం వినూత్న పంథాలో అంద‌రికీ అందాల‌ని రిలీజ్ డే రోజునే ఏపీ ఫైబ‌ర్ నెట్ స‌బ్ స్క్రిప్ష‌న్ ఉన్న వాళ్లు టీవీల్లో కొత్త సినిమా చూసేయ‌డం సాధ్య‌మేన‌ని వెల్ల‌డించారు.

నిర్మాత‌లు ఒప్పుకున్నారా?

కేవ‌లం 24 గం.లు మాత్ర‌మే ఈ కొత్త సినిమా ఫైబ‌ర్ నెట్ లో అందుబాటులో ఉండ‌నుంది. కానీ ఇది ఓటీటీ త‌ర‌హా కాదు. జూన్‌2న విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 3 నెలల్లో పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తెస్తామ‌ని గౌత‌మ్ రెడ్డి వెల్ల‌డించారు. ఇప్పటికే సినీరంగ ప్రముఖులతో చర్చలు జరిపామ‌ని నిర్మాత‌ల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. పెద్ద సినిమాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామ‌ని కూడా గౌతమ్ రెడ్డి అన్నారు. ప్ర‌స్తుతం దీనిపై నిర్మాత‌లు స‌హా ఎగ్జిబిట‌ర్లు పంపిణీ వ‌ర్గాల్లోను ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.