'మేజర్' కు సెన్సార్ సభ్యులు సెల్యూట్..?

Tue May 24 2022 15:01:48 GMT+0530 (IST)

Censor members salute to Major?

వర్సటైల్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.శేష్ కు ''మేజర్'' అనేది ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని యువ హీరో మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

'మేజర్' చిత్రానికి మొత్తం 149 నిమిషాల నిడివితో సెన్సార్ బోర్డ్ 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్ ను జారీ చేసింది. సినిమాలోని కంటెంట్ మరియు లోతైన భావోద్వేగాలు సెన్సార్ అధికారులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా అయిపోయాక సెన్సార్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడమే కాదు.. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కు సెల్యూట్ కొట్టారట. 'మేజర్' సినిమా ఫస్టాప్ లో సందీప్ వ్యక్తిగత జీవితంలోని విషయాలను చూపించగా.. సెకండాఫ్ ను చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దారని తెలుస్తుంది.

మేజర్ కు తన తల్లిదండ్రులతో అనుబంధం మరియు ప్రేయసి ఇషాతో లవ్ సీన్స్ వంటివి ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేస్తాయని అంటున్నారు. అలానే ఇంటెన్స్ యాక్షన్ - హై మూమెంట్స్ మరియు భావోద్వేగానికి గురి చేసే సీన్స్ తో వీక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చెబుతున్నారు.

హై ప్రొడక్షన్ వాల్యూస్ మరియు బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ లు ఈ చిత్రానికి ఇతర ప్రధాన హైలైట్స్ గా నిలవనున్నాయి. అడివి శేష్ మరోసారి తన అద్భుతమైన నటనతో.. నమ్మశక్యంకాని ట్రాన్స్ఫర్మేషన్ తో ఆకట్టుకోబోతున్నారు

ఇప్పటికే విడుదలైన 'మేజర్' ప్రమోషనల్ కంటెంట్ తో ఈ విషయంలో స్పష్టత వచ్చింది. పాటలు - టీజర్ - ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన రియల్ హీరో మేజర్ సందీప్ కు ఈ సినిమా పరిపూర్ణ నివాళి అని భావించవచ్చు.

'మేజర్' చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. కథ - స్క్రీన్ ప్లే శేష్ అందించాడు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా  సంస్థ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాసారు.

ఇందులో సయీ మంజ్రేకర్ - శోభితా ధూళిపాళ - ప్రకాష్ రాజ్ - రేవతి మరియు మురళీ శర్మ ఇతర పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ''మేజర్'' చిత్రాన్ని జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే విడుదలలకు పది రోజుల ముందు నుంచే ఈ సినిమా ప్రివ్యూలు దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి.

హైదరాబాద్ ఏఎమ్బీ మాల్ సహా 9 ప్రధాన నగరాల్లో మే 24 నుంచి రోజుకో కేంద్రంలో 'మేజర్' ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ - ఢిల్లీ - లక్నో - జైపూర్ - బెంగళూరు - ముంబై - పూణె - అహ్మదాబాద్ - కొచ్చి వంటి నగరాల్లో ఈ ప్రివ్యూలు ప్రదర్శిస్తారు. ఇందుకోసం మేకర్స్ బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇలా రిలీజ్ కు అన్ని రోజుల ముందే ప్రివ్యూస్ వేయడం దేశంలోనే తొలిసారి. 'మేజర్' సినిమా మీదున్న నమ్మకంతో మరింత పాపులారిటీ తెచ్చుకునేందుకే ఈ తరహా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. తెలుగు హిందీ మలయాళ భాషల్లో సాదారణ టికెట్ రేట్లతో రాబోతున్న ఈ బయోపిక్.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.