పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

Tue Jan 31 2023 09:00:01 GMT+0530 (India Standard Time)

Celebrations among Pawan's fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఈ మధ్య షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఎప్పట్నుంచో పెండింగ్లో ఉన్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ను పున:ప్రారంభించి కొన్ని రోజుల పాటు వరుసగా కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం.. మరోవైపు ఒకదాని తర్వాత ఒకటి కొత్త సినిమాల అనౌన్స్మెంట్లు ఇవ్వడం ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం.. ఇలా గత రెండు నెలలుగా సందడి సందడిగా ఉంది వ్యవహారం. ఇంతకుముందు ప్రకటించిన సుజీత్ సినిమాకు ఈ రోజు ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ వేడుకను నభూతో అన్న రీతిలో నిర్వహించారు.సినిమా ప్రారంభోత్సవం కోసమే ఒక భారీ సెట్ వేయడం అన్నది అరుదైన విషయం. పవన్తో సినిమా అంటే నిర్మాతలు ఎంత ప్రత్యేకంగా భావిస్తారో చెప్పడానికి ఇది రుజువు. ఇక పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతుండటం.. ఒకప్పుడు 'గబ్బర్ సింగ్' సినిమా షో చూసి పవర్ స్టార్ అంటూ నినాదాలు చేసుకుంటూ బయటికి వచ్చిన సుజీత్ ఇప్పుడు ఆయన పక్కన నిలబడి సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడం అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది.

ఇక ఈ వేడుకకు క్యాజువల్ డ్రెస్లో వచ్చినప్పటికీ పవన్ సూపర్ స్టైలిష్గా కనిపించడంతో అభిమానుల ఉత్సాహం మరింత ఎక్కువ అవుతోంది.

మొత్తంగా పవన్ అభిమానులు సంబరాల మోడ్లో ఉన్నారన్నది వాస్తవం. సోషల్ మీడియా ఈ సినిమా విశేషాలతోనే ఊగిపోతోంది.

ఐతే అంతా బాగుంది కానీ.. ఒకదాని తర్వాత ఒక సినిమాకు ప్రారంభోత్సవం జరిపిస్తున్న పవన్.. వీటి షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటాడు.. దేనికి ఎలా డేట్లు సర్దుబాటు చేస్తాడు.. ఎన్నికలకు అటు ఇటుగా ఏడాదే సమయం ఉన్న నేపథ్యంలో పార్టీకి ఎలా న్యాయం చేస్తాడు.. అసలు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకైనా క్లారిటీ ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సుజీత్ సినిమా త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు కానీ.. 'హరిహర వీరమల్లు' పూర్తి కాకుండా హరీష్ శంకర్ చిత్రం మొదలవకుండా.. మరోవైపు 'వినోదియ సిత్తం'ను పట్టాలెక్కించకుండా దీనికి ఎలా న్యాయం చేస్తాడో అర్థం కావడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.