Begin typing your search above and press return to search.

బాహుబలి కోఆర్డినేటర్ కు క్యాన్సర్.. రాజమౌళి పై మండిపడుతున్న నెటిజన్లు..!

By:  Tupaki Desk   |   29 Jan 2022 3:30 PM GMT
బాహుబలి కోఆర్డినేటర్ కు క్యాన్సర్.. రాజమౌళి పై మండిపడుతున్న నెటిజన్లు..!
X
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి శనివారం ట్విట్టర్ వేదికగా ఓ సహాయం కోరారు. తన సినిమాలకు కో ఆర్డినేటర్ గా వర్క్ చేసిన దేవిక అనే మహిళ బ్లడ్ క్యాన్సర్ బారిన పడిందని.. ఆమె వైద్యం కోసం ఫండ్ రైజింగ్ చేయమని కోరుతూ దర్శకుడు ఓ ట్వీట్ చేశారు.

''బాహుబలి సినిమా సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. ఆమె పలు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కో ఆర్డినేటర్ గా పనిచేసింది. ఆమె అంకిత భావం ఎనలేనిది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతుంది. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెటో(KETTO) ఫండ్ రైజింగ్ కి మీ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను'' అని పేర్కొన్న రాజమౌళి.. ఈ మేరకు దేవిక ఫోటోలను సైతం షేర్ చేశారు.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవిక గతంలో ఓసారి క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. దేవిక పెద్ద కుమారుడు అరుదైన వ్యాధితో బాధ పడుతుండటంతో.. వైద్యం కోసం భర్తతోపాటు ఆమె కూడా ఉద్యోగం చేయడం ప్రారంభించింది. కుమారుడి ఆరోగ్యం మెరుగుపడుతుందనే సమయంలో ఆమె భర్త కిడ్నీ సమస్యతో కన్నుమూశారు. దీంతో కుటుంబ బాధ్యత అంతా తన మీద వేసుకున్న దేవిక.. మరోసారి క్యాన్సర్ బారిన పడింది. చికిత్స కోసం సుమారు రూ.3 కోట్లు అవసరమవ్వడంతో ఆన్ లైన్ క్రౌడ్ ఫండింగ్ సైట్ ద్వారా సహాయం అర్థించారు. ఇది తెలుసుకున్న రాజమౌళి ట్విటర్ వేదికగా దేవికకు సాయం చేయమని కోరారు.

అయితే రాజమౌళి ట్వీట్ పై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమాలు 30 నుంచి 40 కోట్ల వరకు తీసుకునే దర్శకుడు.. తనే స్వయంగా రూ. 3 కోట్లు సాయం చెయ్యలేరా అని ప్రశ్నిస్తున్నారు. అందులోనూ తన సినిమాలకు పని చేసిన వ్యక్తి ధీనగాథ తెలిసి కూడా.. చికిత్స కోసం ఫండ్ రైజింగ్ చేయమని రాజమౌళి వంటి కాస్ట్లీ డైరెక్టర్ కోరడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం జక్కన్నను నిందిచడం తగదని.. ఇప్పటి వరకు కలెక్ట్ అయిన కోటి డెబ్భై లక్షల్లో మెజారిటీ భాగం ఆయనే డొనెట్ చేసి ఉండొచ్చని.. అలానే ఆమెకు ఇతర సహాయసహకారాలు అందించి ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా క్రౌడ్ ఫండింగ్ ద్వారా దేవికకు సాయం అందినా అందకపోయినా.. రాజమౌళి ఆమెకు తగిన ఆర్థిక సాయం చేసి ఆమె ప్రాణాలు కాపాడాలని నెటిజన్స్ కోరుతున్నారు.