'పుష్ప 2 '.. మళ్లీ అతని పేరే వినిపిస్తోంది!

Mon Jun 27 2022 20:00:01 GMT+0530 (IST)

Buzz Vijay Setupathi in Pushpa 2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీ 'పుష్ప :  ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సాధించడమే కాకుండా భారీ వసూళ్లని రాబట్టి దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మళయాల కన్నడ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లోనూ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.

అక్కడ ఈ మూవీ సాధించిన వసూళ్లు ట్రేడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసిన సుకుమార్ అత్యత భారీ బడ్జెట్ తో పార్ట్ 2 ని తెరపైకి తీసుకురాబోతున్నారట. ఫస్ట్ పార్ట్ కి మించి పార్ట్ 2 ని దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ని ఫైనల్ గా లాక్ చేసిన చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టానట్టుగా తెలుస్తోంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ ని సిద్ధం చేసే పనిలో వున్నారట. ఇదిలా వుంటే జూలై లేదా ఆగస్టులో సెట్స్ పైకి రానున్న ఈమూవీపై ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. పార్ట్ 2 కోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించనున్నాడని చెబుతున్నారు.

పార్ట్ 2 లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పార్ట్ 2 లో ఈ పాత్రకు బాస్ గా పై అధికారి పాత్రలో విజయ్ సేతుపతి నటించే అవకాశం వుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. 'పుష్ప'లో ముందు విజయ్ సేతుపతినే ఫహద్ ఫాజిల్ పాత్ర కోసం అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ పాత్రని విజయ్ సేతుపతి చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

అదే పాత్రని ఫహద్ ఫాజిల్ చేత చేయించారు. అయితే పార్ట్ 2 లోనూ మరో పవర్ ఫుల్ సీనియర్ పోలీస్ అధికారి పాత్ర వుందట. ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతిని రంగంలోకి దింపాలని సుకుమార్ హీరో అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈసారైనా విజయ్ సేతుపతి 'పుష్ప' కోసం రంగంలోకి దిగుతాడా? ..ఇది కూడా వార్తగానే మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.