ఫ్లైట్ లో నటితో వ్యాపారవేత్త అసభ్య ప్రవర్తన.. తర్వాతేమైందంటే?

Thu Oct 21 2021 09:45:20 GMT+0530 (IST)

Businessman indecent behavior with actress on flight

షాకింగ్ ఉదంతం ఒకటి కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. విమాన ప్రయాణంలో తన పక్కన కూర్చున్న ఒక టీవీ నటి పట్ల వ్యాపారవేత్త ఒకరు అసభ్యంగా వ్యవహరించిన వైనం వెల్లడైంది. తాజాగా అరెస్టు అయిన అతగాడి చేతిలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నటి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. టీవీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి అక్టోబరు మూడున ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు.
విమానం ముంబయికి చేరుకోవటంతో.. తన బ్యాగ్ ను తీసుకునేందుకు నిలుచున్నారు. అదే సమయంలో.. ఆమె సీటు పక్కనే ఉన్న వ్యక్తి ఒకరు ఆమె నడుం పట్టుకొని ఒక్కసారిగా తన ఒళ్లోకి లాక్కున్నారు. దీంతో షాక్ కు గురైన ఆమె.. తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో.. అతగాడు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆమెను అతడిగా భావించానని.. అందుకే అలా జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నం చేసి.. సారీ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో షాక్ కు గురైన సదరు నటి.. ఇంటికి వెళ్లి.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సదరు విమానయాన సంస్థకు ఈమొయిల్ చేసింది.తన పక్కన కూర్చున్న వ్యక్తి వివరాల్ని తనకు తెలియజేయాలని కోరారు. దీనికి నో చెప్పిన సదరు విమానయాన సంస్థ.. తాము పోలీసులకు సమాచారం ఇస్తామని చెప్పి.. వారికి వివరాలు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూపీలోని ఘజియాబాద్ కు చెందిన సదరు వ్యాపారవేత్తను ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఇదిలా ఉండగా.. సదరు నటి ఇటీవల తాను పాల్గొన్న ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించారు.

సదరు వ్యాపారవేత్త తీరుతో తానను భయాందోళనకు గురైనట్లు చెప్పారు. అంతేకాదు.. తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని.. నిందితుడి భార్య.. మరో వ్యక్తి తన ఇంటికి వచ్చి మరీ ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తానీ ఉదంతంతో మరింతగా ఆందోళన చెందుతున్నట్లుగా పేర్కొన్నారు.‘వారికి నా ఇల్లు తెలిసిపోయింది. కేసు వాపసు తీసుకొమ్మని అడిగారు. మళ్లీ నావద్దకు ఎవరో ఒకరు వస్తారని భయంగా ఉంది’ అని పేర్కొన్నారు. మొత్తంగా చెత్త పని చేసిన వ్యాపారవేత్తకు చెప్పు దెబ్బలా వ్యవహరించిన నటి తీరు బాగానే ఉన్నా.. ఆమె ఆందోళనలో అర్థముందని చెప్పక తప్పదు. మరి.. దీనిపై పోలీసులు ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి.