బన్నీ అలా ఇంకెన్నాళ్లు ఉంటాడు...?

Sun Jul 12 2020 20:00:00 GMT+0530 (IST)

Bunny will be like that for many more years ...?

టాలీవుడ్ లో లుక్ విషయంలో ప్రతి సినిమాకి వేరియేషన్ కోరుకునే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. 'గంగోత్రి' సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీని చూసి అందరూ నెగిటివ్ కామెంట్స్ చేసారు. నెక్స్ట్ సినిమా 'ఆర్య' కోసం తన లుక్ మార్చేసిన బన్నీ.. నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి నోటే వావ్ అనిపించేలా చేసాడు. ఇక 'బన్నీ' సినిమాతో ఫ్యాన్స్ 'స్టైలిష్ స్టార్' అనే ట్యాగ్ లైన్ ఇచ్చేసారు. అప్పటి నుంచి సినిమా సినిమాకి తన యాక్టింగ్ తో పాటు లుక్స్ పరంగా కూడా చేంజెస్ చూపిస్తూ వస్తున్నారు. 'దేశముదురు' సినిమా కోసం లాంగ్ హెయిర్ తో కనిపించడంతో పాటు సిక్స్ ప్యాక్ బాడీ కూడా మైంటైన్ చేసారు. 'పరుగు' 'ఆర్య 2' 'వరుడు' 'వేదం' 'బద్రీనాథ్' సినిమాలలో పాత్రకు తగ్గ లుక్స్ ని చూపిస్తూ వచ్చాడు.'జులాయి' 'ఇద్దరమ్మాయిలతో' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'రేసుగుర్రం' సినిమాలతో యూత్ మొత్తం తన స్టైల్ ని అనుకరించేలా చేసాడు. ఇక 'సరైనోడు' సినిమాలో ఒత్తుగా ఎదిగిన మీసకట్టుతో కనిపించాడు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా కోసం కంప్లీట్ మిలిటరీ గెటప్ లోకి మారిపోయి కొత్త హెయిర్ స్టైల్ తో పాటు కనుబొమ్మ దగ్గర గాటు కూడా పెట్టుకున్నాడు. 'అల వైకుంఠపురములో' సినిమాలో మళ్ళీ మరో కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ఇలా స్టైలిష్ స్టార్ అని అభిమానులు పిలుచుకునే పేరుని సార్ధకం చేసుకుంటూ ప్రతి సినిమాకి ఏదొక కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా కోసం బన్నీ కంప్లీట్ లుక్ చేంజ్ చేసాడు. మొరటు కుర్రాడిగా.. లారీ డ్రైవర్ గా కనిపించడం కోసం ఒత్తుగా ఉంగరాల జుట్టు పెంచి గుబురు గడ్డం కూడా పెంచేసాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా కోసం ఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు. ఇప్పటికే 'పుష్ప' నుండి విడుదలైన ఫస్ట్ లుక్ లో బన్నీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అడవుల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోవాల్సిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకునేలోపు కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసింది. దీంతో ఇప్పటికే నాలుగు నెలల సమయం వేస్ట్ గా పోయింది. అల్లు అర్జున్ మాత్రం అదే లుక్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు.

ఇటీవల సతీమణితో కలిసి వాకింగ్ చేస్తూ కనిపించినప్పుడు.. లేటెస్టుగా మార్నింగ్ వాక్ చేస్తున్నాని బన్నీ పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే అతను 'పుష్ప' కోసం అదే గెటప్ లో ఉన్నాడని అర్థం అవుతోంది. ఇంతకముందు కంటే ఎక్కువ గడ్డంతో కనిపిస్తున్నాడు. అయితే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఐడియా లేకపోవడంతో అల్లు అర్జున్ ఇన్ని నెలలైనా అదే గెటప్ మైంటైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి పరిస్థితులు చూస్తుంటే మరో రెండు నెలలైనా షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు లేవని అర్థం అవుతోంది. ఇప్పటికైనా బన్నీ దానికి తగ్గట్టు ట్రిమ్ చేసుకొని కొంచెం రిలీఫ్ అవుతాడేమో చూడాలి.