Begin typing your search above and press return to search.

'శంకరాభరణం' సినిమాతో నాకున్న సంబంధం అదే: బ్రహ్మాజీ

By:  Tupaki Desk   |   15 Aug 2022 11:30 PM GMT
శంకరాభరణం సినిమాతో నాకున్న సంబంధం అదే: బ్రహ్మాజీ
X
బ్రహ్మాజీ సీనియర్ ఆర్టిస్ట్ .. హీరో అనదగిన సినిమాలు ఒకటి రెండు చేస్తూ వచ్చిన ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రలను చేస్తూ వచ్చాడు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలలోను విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ కూడా ఆయన తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ .. యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ కుర్రాడిలా ఉన్నావంటూ సహనటులు చాలామంది ఆయనను ఆటపట్టిస్తుంటారు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు.

"నాకు .. 'శంకరాభరణం' సినిమాకు సంబంధం ఉంది. ఆ సినిమా వల్లనే నేను సినిమాల్లోకి వచ్చాను. మా నాన్నగారు రెవెన్యూ డిపార్టుమెంటులో పనిచేసేవారు. 'శంకరాభరణం' విజయవంతమైన సందర్భంగా రెవెన్యూ డిపార్టుమెంటు వాళ్లంతా కలిసి సోమయాజులు గారికి సన్మానం చేశారు. అందరూ ఆయనకి ఇచ్చే గౌరవం .. ఆయన కాళ్లపై పడిపోవడం చూశాను. ఒక ఆర్టిస్ట్ కి ఎంత గుర్తింపు ఉంటుందనేది దగ్గరగా చూసిన తరువాత సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగింది. దాంతో చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాను.

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలామందిలా నేను సినిమా కష్టాలను ఫేస్ చేయలేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బు పంపించేవారు. ఆ డబ్బును పొదుపుగా వాడుకుంటూ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను.

కెరియర్ ఆరంభంలో నాకు మంచి మంచి సినిమాలు .. పాత్రలు పడ్డాయి. గులాబీ .. సిందూరం .. నిన్నే పెళ్లాడుతా వంటి సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి. ఆ తరువాత పదేళ్ల పాటు నేను ఆశించినస్థాయి పాత్రలు పడలేదు. ఆ సమయంలో నేను నిరాశపడ్డానుగానీ, ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చానని బాధపడలేదు.

ఎందుకంటే ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఇంత గుర్తింపు రాదు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా చూస్తారు .. గౌరవిస్తారు. అందువలన నటుడిగా నాకు సంతృప్తి ఉంది. పోలీస్ పాత్రలు ఎక్కువగా చేయడం వలన, పోలీస్ లు అంతా కూడా తమలో ఒకడిగా నన్ను భావిస్తుంటారు.

నటుడిగా 30 ఏళ్లను పూర్తిచేసుకోనున్నాను. అయినా నేను ప్రేక్షకులకు బోర్ కొట్టకపోవడానికి కారణం, నేను ఎంచుకుంటూ వెళుతున్న విభిన్నమైన పాత్రలే. ఇకపై కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతాను" అని చెప్పుకొచ్చాడు.