అక్కడ ఓటీటీ జోరు మామూలుగా లేదుగా

Wed Jul 08 2020 12:21:29 GMT+0530 (IST)

Bollywood movies releasing on OTT

మహమ్మారి వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా గత నాలుగు నెలలుగా థియేటర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. రాబోయే రెండు మూడు నెలల్లో కూడా పూర్తి స్థాయిలో థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పూర్తి అయిన చాలా సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలకు సిద్దం అవుతున్నాయి. సౌత్ లో పెద్ద సినిమాలు ఓటీటీ లో వచ్చేందుకు స్టార్ ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. కాని హిందీ సినిమాలను మాత్రం ఓటీటీలో వరుసగా విడుదల చేస్తున్నారు.ఇప్పటికే పదుల సంఖ్యలో ఓటీటీ విడుదలకు సిద్దం అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తాజాగా డిస్నీ హాట్ స్టార్ హిందీ సినిమాలను వరుసగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఇదే క్రమంలో జీ 5 కూడా హిందీ సినిమాలను వరుసగా విడుదల చేసేందుకు చర్చలు జరుపుతోంది. అందులో భాగంగానే శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ‘యారా’ అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అయ్యింది.

విద్యుత్ జమ్మావాల్ హీరోగా నటించిన ఈ చిత్రంకు టిగ్మాన్షు ధులియా దర్శకత్వం వహించాడు. ఫ్రెంచ్ మూవీ ఏ గ్యాంగ్ స్టోరీకి రీమేక్ అయిన ‘యారా’ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంను భారీ మొత్తానికి నిర్మాతలు జీ 5 కి అమ్మేసినట్లుగా తెలుస్తోంది. శృతి హాసన్ సినిమా అవ్వడంతో సౌత్ లో కూడా ఈ చిత్రంపై జనాల్లో ఆసక్తి ఉంది.