నా కూతురికి మాత్రమే ఆ అదృష్టం దక్కింది: ఐశ్వర్యరాయ్

Sun Sep 25 2022 14:05:48 GMT+0530 (India Standard Time)

Bollywood Actress Aishwarya Rai Bachchan

మణిరత్నం దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో 'పొన్నియిన్ సెల్వన్' సినిమా రూపొందింది. మణిరత్నం కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఐశ్వర్య రాయ్ సైతం ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరవుతూ ఉండటం విశేషం. మణిరత్నంపై ఆమెకి గల గౌరవభావమే అందుకు కారణమనుకోవాలి.మణిరత్నం సినిమాలో నటించడం ఐశ్వర్యారాయ్ కి కొత్త కాదు. ఇంతకుముందు ఆమె మణిరత్నం దర్శకత్వంలో సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో ఆమె పాత్రలకి ఎంత ప్రాధాన్యం ఉందనేది అందరికీ తెలుసు. చాలాకాలంగా సినిమాలను పక్కన పెట్టేసిన ఐశ్వర్య రాయ్ మళ్లీ కెమెరా ముందుకు రావడానికి కారణం మణిరత్నం పై ఆమెకి గల నమ్మకమే అనుకోవాలి. ఈ సినిమాను ఆమె ఒప్పుకోవడం ఒక విశేషమైతే ఎక్కడ ప్రీ రిలీజ్ జరిగినా ఆమె  హాజరవుతూ ఉండటం మరో విశేషం.

మణిరత్నం దర్శకత్వంలో చేసే అవకాశం లభించడం తన అదృష్టమని చెబుతూ వచ్చిన ఆ ఐశ్వర్య రాయ్ తాజా ఈవెంట్ లో మాట్లాడుతూ ఎవరికీ దక్కని అదృష్టం తన కూతురికి దక్కిందంటూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. " ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగా ఒక రోజున నా కూతురు ఆరాధ్య సెట్ కి వచ్చింది. ఆ సెట్ మరో ప్రపంచంలా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. తను అలా పరిసరాలను గమనిస్తూ ఉండగా మణిరత్నం గారు పిలిచి ఒక షాట్ కి 'కట్' చెప్పే ఛాన్స్ ఇచ్చారు. అది చూసి అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

సాధారణంగా మణిరత్నం గారు కట్ చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వరు. ఆయన కెరియర్ లో ఇంతవరకూ మరొకరికి కట్ చెప్పే అవకాశమిచ్చిన దాఖలాలు లేవు. అందువలన ఆయన ఆరాధ్యతో కట్ చెప్పించడం చూసి అంతా షాక్  అయ్యారు. ఇది ఇంతవరకూ ఎవరికీ దక్కని అదృష్టం .. నా కూతురుకు దక్కడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు. ఇది 40 ఏళ్లుగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పడం .. పెద్ద సంఖ్యలో స్టార్స్ యాక్ట్ చేయడం .. పాప్యులర్ నవల ఆధారంగా రూపొందడం అంచనాలు పెంచుతోంది.