Begin typing your search above and press return to search.

డబ్బు కోసం ఇలాంటి మూవీలా? ప్రముఖ నటుడ్ని తిట్టేసిన సతీమణి

By:  Tupaki Desk   |   28 May 2023 8:53 AM GMT
డబ్బు కోసం ఇలాంటి మూవీలా? ప్రముఖ నటుడ్ని తిట్టేసిన సతీమణి
X
ఎంత సినిమా అయినా.. కొన్ని పాత్రల్ని చేసినప్పుడు ఆయా నటుల కుటుంబాల్లోని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. చాలామంది బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడరు. అందుకు భిన్నంగా తన సినిమాల ఎంపికలో వచ్చిన మార్పు గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయి. బాలీవుడ్ లోని అత్యుత్తమ నటుల్లో ఒకరిగా మనోజ్ కున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆయన అల్లు అర్జున్ నటించిన హ్యాపీ మూవీలో చేయటం తెలిసిందే.

తన సినిమాల ఎంపికలో వచ్చిన మార్పు గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను నటించిన ఒక సినిమాను చూసేందుకు తన భార్య థియేటర్ కు వెళ్లిందని.. ఆ సినిమా పేరును తాను చెప్పాలనుకోవటం లేదని చెప్పిన మనోజ్.. 'అదో బ్యాడ్ మూవీ. అందులో నేను హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఉంటా. నా పాత్రను చూసి థియేటర్ లోని కొందరు అమ్మాయిలు చులకనగా మాట్లాడారు. సినిమా అయ్యాక తను ఫోన్ చేసింది. డబ్బుల కోసం ఇలాంటి సినిమాలు చేయటం మానేయండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్ లోని వారి మాటలు విని అవమానకరంగా ఫీల్ అవుతున్నా. ఇకనుంచి అలాంటివి మానేయండి' అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

అప్పటి నుంచి తాను సినిమాల్ని ఎంచుకునే విషయంలో మార్పు వచ్చిందన్నారు. తన భార్య మాటకు తగ్గట్లే అప్పటి నుంచి సినిమాల్ని ఎంపిక చేసుకునే విషయంలో మార్పు వచ్చిందని.. ప్రేక్షకులకు చేరువయ్యే పాత్రల్ని తాను చేయటం మొదలుపెట్టినట్లు చెప్పారు. మనోజ్ బాజ్ పేయి మాటలు ఆసక్తికరంగా మారాయి. మరికొందరు మాత్రం మనోజ్ భార్య చెప్పిన సినిమా ఏమై ఉంటుందన్న కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు.