ఏపీలో టికెట్ ధరలతో బిగ్ పంచ్!

Tue Dec 07 2021 17:00:01 GMT+0530 (IST)

Big punch with ticket prices on AP

ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్టు ధరలు బిజినెస్ డీల్స్ పై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయా? అంటే అవుననే సమాచారం. ఇటీవల పలు భారీ చిత్రాల డీల్స్ విషయంలో పంపిణీదారులు వెనక్కి తగ్గుతున్న తీరు అందుకు నిదర్శనం.సంక్రాంతి బరిలో రిలీజవుతున్న భారీ చిత్రాలన్నిటిపైనా ఈ ప్రభావం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ రైట్స్ పైనా ఈ ప్రభావం పడింది. ఏపీ ఏరియాకి ఆర్.ఆర్.ఆర్ ని 60కోట్ల రేంజుకు అమ్మగా ఇప్పుడు 15శాతం కోతతో 50కోట్లకు తగ్గారని గుసగుస వినిపిస్తోంది. మరోవైపు సంక్రాంతి బరిలోనే వస్తున్న భీమ్లా నాయక్.. రాధేశ్యామ్ లాంటి చిత్రాల రైట్స్ పైనా పరోక్షంగా టిక్కెట్టు రేటు ప్రభావం ఉంది.

ఈనెల 17న బన్ని నటించిన `పుష్ప- ది రైజ్` సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదల చేస్తున్నారు. అయితే ఏపీలో టిక్కెట్టు ధరల సవరణ వల్ల పుష్ప కలెక్షన్లకు గండి పడనుంది. మునుపటితో పోలిస్తే ఏపీలో ఆశించిన రేంజులో వసూళ్లను సాధించడం అసాధ్యమని తేలింది.

ఇటీవల విడుదలైన పెద్ద సినిమా అఖండకు టిక్కెట్టు రేటు శాపం అయ్యింది. లేదంటే ఏపీలో బాలయ్య మరిన్ని రికార్డులను బ్రేక్ చేసేవారన్న టాక్ వినిపించింది. ఓవరాల్ గా ఏపీలో టిక్కెట్టు ధరల తగ్గింపు భారం వసూళ్లపై ప్రభావవంతంగా కనిపిస్తోంది. చాలాచోట్ల గిట్టుబాటు కావడం లేదని ఎగ్జిబిటర్లు పంపిణీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో క్రేజ్ ఉండే అగ్ర హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే చిన్న సినిమాలకు తగ్గించిన రేట్లతో ఎలా గిట్టుబాటు అవుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది.