Begin typing your search above and press return to search.

దీపిక‌కు వ‌చ్చిన ఐడియా చిరంజీవికి రాలేదా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:30 PM GMT
దీపిక‌కు వ‌చ్చిన ఐడియా చిరంజీవికి రాలేదా?
X
నిన్న‌టిరోజున స‌డెన్ గా బాలీవుడ్ ఆద‌ర్శ జంట దీపిక ప‌దుకొనే- ర‌ణ‌వీర్ తో పీవీ సింధు లంచ్ పార్టీలో పాల్గొని అనంత‌రం ఫుల్ ఛీర్స్ మూడ్ లో క‌నిపించ‌డంతో అంతా షాక్ తిన్నారు. ఉన్న‌ట్టుండి స‌డెన్ గా ఇలా పీవీ సింధుతో లంచ్ పార్టీలేమిటీ? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇంత‌లోనే ఈ క‌ల‌యిక వెన‌క బ్ర‌హ్మ ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డింది ఇప్పుడు.

ఇది ఓ బిగ్ డీల్ కోసం మీటింగ్. పీవీ సింధు ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో పత‌కం సాధించిన తర్వాత త‌న పేరు అంత‌ర్జాతీయంగా మార్మోగుతోంది. ఇప్ప‌టికే రెండుసార్లు ఒలింపిక్ క‌ప్ లు గెలిచిన సింధు జీవిత‌క‌థ‌తో సినిమా తీస్తే అది యువ‌త‌రంలో స్ఫూర్తి నింపుతుంది. నిర్మాత‌ల‌కు బాక్సాఫీస్ క‌ల‌శం నిండుతుంది. న‌టీన‌టుల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు ద‌క్కుతుంది. ఆ కోణంలో ఆలోచించిన డీప్ వీర్ ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే బిగ్ డీల్ కుదుర్చుకునేందుకు సింధుని లంచ్ కి ఆహ్వానించారు. యంగ్ స్పోర్ట్స్ లెజెండ్ సింధు జీవితంపై త్వరలో సినిమా తీయడానికి దీపిక ప్రయత్నిస్తోంది.

దీపికా పదుకొనే తెరపై తన పాత్రను పోషించాలని కోరుకుంటున్నానని సింధుకు తెలిపారు. ఇప్పుడు సింధు బయోపిక్ లో న‌టిస్తూ స్వయంగా త‌నే నిర్మిస్తుంద‌ని పుకార్లు విన‌వస్తున్నాయి. ఇక ఈ బ‌యోపిక్ తీస్తే లాభంలో వాటాల్ని పీవీ సింధుకి ఇస్తార‌ట‌. ఈ సినిమా హిందీలో తెర‌కెక్కి తెలుగులో అనువాదం రూపంలో విడుద‌ల‌య్యేందుకు ఆస్కారం లేక‌పోలేదు. విజ‌య‌వంతంగా తెర‌కెక్కించాలంటే నిపుణుడైన‌ ఒక పెద్ద దర్శకుడి కోసం ప్రయత్నిస్తున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సింధు బయోపిక్ ను దీపిక ఎంచుకుంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. సింధు కూడా సరిహద్దులను దాటి గుర్తింపు పొందుతుంది. అయితే దీపిక దీనికోసం చాలా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే త‌ను స్వ‌త‌హాగానే క్రీడాకారిణి. జాతీయ స్థాయిలో బ్యాడ్మింట‌న్ లో రాణించి త‌ర్వాత ఆట‌ను వ‌దిలేసి స్టార్ అయ్యారు. దీపిక తండ్రి ప్ర‌కాష్ ప‌దుకొనే కూడా గొప్ప క్రీడాకారుడు కోచ్ అన్న సంగ‌తి తెలిసిన‌దే. అందుకే వెంట‌నే పీవీ సింధు బ‌యోపిక్ పై దృష్టి సారించింది దీపిక‌. సైనా నెహ్వాల్ బ‌యోపిక్ కోసం ప‌రిణీతి అంత‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం అస‌లే లేదు. ఇక‌పోతే బ‌యోపిక్ కేట‌గిరీలో వ‌చ్చిన మేరీకోమ్ బ‌యోపిక్ లా పెద్ద విజ‌యం అందుకునేందుకు అవ‌స‌ర‌మైన సామాగ్రిని చేర్చ‌డంలో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల ప‌నిత‌నం చాలా ముఖ్యం.

రెస్టారెంట్ లో క‌లిసారు ఇంత‌లోనే..

బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొనే ముంబైలో శనివారం విందు కోసం ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని కలిశారు. పివి సింధు - దీపిక కలిసి నగరంలోని రెస్టారెంట్ లోకి ప్రవేశించగా రణవీర్ ఆ తరువాత వారితో చేరార‌ని క‌థ‌నాలొచ్చాయి. ముంబై వ‌ర్లీలో ని రెస్టారెంట్ లో ఈ ముగ్గురూ లంచ్ చేశారు. అక్క‌డ‌ ఇద్దరు తారలు కూడా ఫోటోగ్రాఫ‌ర్ల‌కు చిరున‌వ్వులు చిందిస్తూ పోజులిచ్చారు. రణ్ వీర్ తెల్లటి చొక్కాలో ఇద్దరితో కలసి కనిపించాడు. తర్వాత దీపిక సింధుతో సెల్ఫీని పంచుకోవడానికి రణవీర్ తన ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లాడు.

స్మాషింగ్ టైమ్! @Pvsindhu1 @దీపికపడుకొనే అంటూ అతను పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చాడు. పివి సింధు ఇటీవల టోక్యో ఒలింపిక్స్ 2020 లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.

చిరుకు బిజినెస్ మైండ్ లేదా?

అన్న‌ట్టు దీపిక ప‌దుకొనే-ర‌ణ‌వీర్ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్ పీవీ సింధుకు అద్భుత‌మైన పార్టీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ స్వ‌యంగా పీవీ సింధుని సన్మానించారు. కానీ ఈ స‌న్మానం విందు కార్య‌క్ర‌మం అనంత‌రం అయినా పీవీ సింధు బ‌యోపిక్ ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ బ్యాన‌ర్ లో నిర్మించాల‌ని అనుకోలేదా? అంటూ ఇప్పుడు అంద‌రూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌పంచీక‌ర‌ణ‌లో ఎవ‌రు ఎక్క‌డ అయినా సినిమాలు తీయొచ్చు .. ఎక్క‌డైనా రిలీజ్ చేయొచ్చు క‌దా! అయినా ప్ర‌తిదీ బాస్ క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించ‌రు క‌దా! అని గుస‌గుసా వేడెక్కిపోతోంది.