కార్మిక ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడికి పెను సవాళ్లు!

Sun May 09 2021 20:00:01 GMT+0530 (IST)

Big challenges for the new president of the Labour Federation

ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడు గా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్ కు 42.. మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. 66 ఓట్లలో ఆయనకు 42 ఓట్లు వచ్చాయి. పీఎస్ ఎన్ దొర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ...దర్శకరత్న దాసరి గారు ఫిలి ఫెడరేషన్ ఏ ఆశయాలతో కొనసాగించారో అవే ఆశయాలతో మేము సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తాం. సినీ కార్మిక ఐక్యత కోసమే మేమంతా పోరాటం చేసి గెలిచాం. కరోనా వల్ల చిత్ర పరిశ్రమలో కార్మికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వారిని ఆదుకోవడంపై మొట్టమొదటగా దృష్టి పెడతాం. చిరంజీవి గారు భరద్వాజ.. సి కళ్యాణ్ లాంటి పెద్దలు.. ఛాంబర్ .. నిర్మాతల మండలి సహకారంతో ఈ కష్టకాలంలో కార్మికులను బతికించుకుంటాం. కార్మికుల వేతనాలు విషయంలో చర్చలు సాగిస్తాం. కార్మికులు ఐక్యతగా ఉండే పరిశ్రమ బాగుంటుంది. మా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నారు.

దేశవ్యాప్తంగా సినీ కార్మిక సంఘాలకు పేరు తెచ్చిన రాజేశ్వర్ రెడ్డి పీఎస్ఎన్ దొర లాంటి వారు ఇవాళ ఫెడరేషన్ ఎన్నికల్లో గెలవడం శుభపరిణామంమని కాదంబరి అన్నారు. తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్.. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత క్రైసిస్ లో కార్మికుల సంక్షేమానికి ఫెడరేషన్ అధ్యక్షుడు ఏం చేస్తారో చూడాలి. చిత్రపురి కాలనీ రాజకీయాల్లోనూ ఆయన యాక్టివ్ గా ఉన్నారు. అయితే చిత్రపురి కాలనీపై ఆరోపణల విషయంలో నూ ఆయన చొరవ చూపి ఇండ్ల పంపిణీలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తారనే ఆశిద్దాం.