వీడియో: ప్రభాస్ - అమితాబ్ చేతుల మీదుగా ప్రముఖ నిర్మాణ సంస్థ కొత్త ఆఫీస్ ప్రారంభం..!

Wed Jun 29 2022 20:06:30 GMT+0530 (IST)

Big Stars At Ashwini Dutts New Office

టాలీవుడ్ లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో 'వైజయంతీ మూవీస్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నందమూరి తారక రామారావు నటించిన 'ఎదురులేని మనిషి' సినిమాతో మొదలైన ఈ సంస్థ.. అగ్ర నిర్మాత చలసాని అశ్వినీదత్ సారథ్యంలో గత ఐదు దశాబ్దాలుగా సుధీర్ఘంగా సాగుతోంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈ ప్రొడ్యూసర్ హౌస్.. ప్రతీ జనరేషన్ హీరోలతో బ్లాక్ బస్టర్లు తీస్తూ వస్తోంది.ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోన్న ఎందరో సినీ వారసులు ఈ బ్యానర్ లోనే హీరోలుగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ సంస్థ బాధ్యతలు అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్న - ప్రియాంక మరియు అల్లుడు నాగ్ అశ్విన్ చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వైజయంతీ మూవీస్ లో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేశారు. వైజయంతీ మూవీస్ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం జూన్ 25వ తేదీన ఘనంగా జరిగింది. లెజండరీ నటుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ ఆఫీస్ ను ఓపెన్ చేయడం విశేషం. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

వైజయంతీ మూవీస్ తాజాగా తమ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ - బిగ్ బీ అమితాబ్ తో పాటుగా హీరోలు నాని - దుల్కర్ సల్మాన్ హాజరై సందడి చేశారు. వీరితో పాటుగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ - క్రిష్ జాగర్లమూడి - ఆది శేషగిరిరావు కూడా ఉన్నారు.

అశ్వినీ దత్ - స్వప్న - ప్రియాంకలు అమితాబ్ కు సాదరంగా ఆహ్వానం పలకడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అలానే ప్రభాస్ - రాఘవేంద్రరావు - క్రిష్ - ఆది శేషగిరిరావులు బాలీవుడ్ సీనియర్ నటుడిని శాలువాలతో సత్కరించారు. ప్రముఖ నటులు దర్శక నిర్మాతలు అందరూ ఒకే చోట దర్శనమివ్వడంతో ఈ వీడియో కనుల పండుగలా ఉంది. దాదాపు వీరంతా అశ్వినీ దత్ బ్యానర్ లో వర్క్ చేసినవారు.. చేస్తున్నవారు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ''ప్రాజెక్ట్ K'' అనే పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ - దీపికా పదుకొణె - దిశా పటాని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇదే నిర్మాణ సంస్థలో దుల్కర్ సల్మాన్ హీరోగా 'సీతారామం' అనే పాన్ సౌత్ ఇండియా మూవీ చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ - రష్మిక మందన్నా - సుమంత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక వైజయంతీ మూవీస్ కు అనుబంధ సంస్థగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై పలు చిన్న మీడియం రేంజ్ చిత్రాలని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.