Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో కాంటాక్టులు బాలీవుడ్ లో కాంట్రాక్టులు!

By:  Tupaki Desk   |   26 July 2021 5:04 AM GMT
టాలీవుడ్ లో కాంటాక్టులు బాలీవుడ్ లో కాంట్రాక్టులు!
X
``దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు!``.. దూకుడులో మ‌హేష్ డైలాగ్ ఇది. శ్రీ‌నువైట్ల ఏ ముహూర్తాన ఆ డైలాగ్ చెప్పించాడో కానీ త‌న ఆస్థాన ర‌చయిత కోన వెంక‌ట్ ఆ పంక్తిని క‌మ‌ర్షియల్ పంథాలో స‌ద్వినియోగం చేస్తున్నారు. వైట్ల‌తో వివాదం త‌ర్వాత స‌ప‌రేష‌న్ అనంత‌ర ప‌రిణామాలు తెలిసిన‌వే. ఆ త‌ర్వాత‌ కోన ఆలోచ‌నా విధానం మారింది. ఆయ‌న నిర్మాత‌గానూ దూకుడు పెంచారు.

ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా అగ్ర క‌థానాయిక‌ల‌తో మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌ను నిర్మించేందుకు కోన వెంక‌ట్ ప్ర‌ణాళిక‌ల్ని రచించారు. అంజ‌లి.. అనుష్క లాంటి నాయిక‌ల‌తో సినిమాల్ని నిర్మించిన సంగ‌తి తెలిసిన‌దే. అనుష్క న‌టించిన నిశ్శ‌బ్ధం చిత్రానికి కోన ఒక నిర్మాత‌గా కొన‌సాగారు. స్టార్ రైటర్ గా కోన వెంకట్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో చాలా బ్లాక్ బస్టర్ లను అందించినా నిర్మాత‌గా ఫ్లాపుల‌తో త‌డ‌బ‌డుతున్నారు.

అయితే కోన ఇటీవ‌ల ఫార్ములా మార్చి తెలివిగా కెరీర్ ని ర‌న్ చేస్తున్నారు. అప్ప‌ట్లో MOM చిత్రంతో జాతీయ అవార్డును ద‌క్కించుకోవ‌డంతో హిందీ సినిమా ప‌రిశ్ర‌మ‌లోనూ అత‌డి పేరు మార్మోగింది. అనంత‌రం అత‌డు బాలీవుడ్ లో సినిమాలు నిర్మించే దిశ‌గా తెలివైన ఎత్తుగ‌డ‌ల్ని అనుస‌రిస్తున్నారు. త‌దుప‌రి `గల్లీ రౌడీ`తో పాటు మూడు ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు కోన తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఈ మూడు చిత్రాలలో రెండు హిందీలో నిర్మిస్తారు. జాన్ అబ్రహం - ఫర్హాన్ అక్తర్ వంటి ప్ర‌ముఖుల‌ను సంప్ర‌దించామ‌ని తెలిపారు. వారి కాల్షీట్ల‌కు అనుగుణంగా ఈ చిత్రాలు తెర‌కెక్కుతాయి. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన గల్లీ రౌడీ త్వ‌ర‌లో విడుదల కానుంది.

బాలీవుడ్ పంథాయే వేరు..

నిజానికి టాలీవుడ్ లో రిలేష‌న్ షిప్స్ వేరు. ఇక్క‌డ మంచి సంబంధాల‌తోనే సినిమాలు తెర‌కెక్కుతాయి. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోల‌తో కాంటాక్ట్ తో ప‌నులు న‌డుస్తాయ‌ని అన్నారు. కానీ బాలీవుడ్ లో అలా కాదు. కార్పొరెట్ కంపెనీల‌తో జ‌రిగే ఒప్పందాల‌తో ప‌నులు అవుతాయి. తాను ఏ సినిమా చేయాల‌న్నా 100 పేజీల కాంట్రాక్ట్ కి సంబంధించిన‌ పుస్త‌కంపై సంత‌కాలు చేయాల‌ని కోన తెలిపారు. బాలీవుడ్ లో ప‌నుల‌న్నీ కాంట్రాక్టుల‌పైనే ఉంటాయ‌న్నారు. త‌న త‌దుప‌రి రెండు హిందీ చిత్రాల‌కు సంబంధించిన ఒప్పందాలు జ‌రిగాక వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు.