Begin typing your search above and press return to search.

80 ఏళ్ళ క్రితం ఏర్పాటైన ఆ థియేటర్ కథ ముగిసినట్లేనా...?

By:  Tupaki Desk   |   18 Jun 2020 12:30 AM GMT
80 ఏళ్ళ క్రితం ఏర్పాటైన ఆ థియేటర్ కథ ముగిసినట్లేనా...?
X
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతపడిపోయాయి. అయితే థియేటర్స్ ఇప్పుడు క్లోజ్ అయినప్పటికీ చాలా రోజుల క్రితం నుండే వీటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. అన్ని థియేటర్స్ మల్టీప్లెక్సెస్ గా రూపాంతరం చెందుతుండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తగ్గాయని చెప్పవచ్చు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా అందరూ ఓటీటీలలో సినిమాలు చూస్తుండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది. ఈ క్రమంలో 81 ఏళ్ళ క్రితం ఏర్పాటైన ఒక థియేటర్ క్లోజ్ అయ్యే పరిస్థితి తలెత్తింది. అదే 'భారత మాతా సినిమా'. 1939లో బొంబాయిలో ఏర్పాటైన ఈ సినిమా హాలు పేరు ఒకప్పుడు 'లక్ష్మీ థియేటర్‌'. ఆ తర్వాత 'భారత మాతా సినిమా'గా మార్చారు. ఈ థియేటర్ ‘నేషనల్‌ కార్పొరేషన్‌ మిల్‌’ స్థలంలో ఆ మిల్లులో పనిచేసే కార్మికుల వినోదం కోసం ఏర్పాటయింది.

కొన్నేళ్ల పాటు దిగ్విజయంగా నడిచిన ఈ థియేటర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల కార్మికులు పెద్ద పెద్ద మిల్లులకు తరలిపోవడంతో సినిమా హాలుకు కష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత మల్టీప్లెక్స్‌ లు, ఓటీటీల రాకతో సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం థియేటర్ ఆధునీకరించడం కోసం మార్చి ఒకటవ తేదీన సినిమా హాలును మూసి వేశారు. ఆ తర్వాత లాక్‌ డౌన్‌ వచ్చి తెరచుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సందర్భంగా ‘భారత మాతా సినిమా’ థియేటర్‌ ఓనర్ కపిల్‌ భోపాత్కర్‌ మాట్లాడుతూ.. ''ప్రతి పదేళ్లకోసారి ఓ కొత్త సవాల్‌ వచ్చి పడుతూనే ఉంది. 1980 దశకంలో సినిమా వీడియోలు వచ్చాయి. ఇక సినిమా థియేటర్ల పని అయిపోయిందన్నారు. 2010లో టెర్రరిజమ్‌ బాంబు దాడులు.. ఆ తర్వాత మల్టీ ప్లెక్సులు, ఓటీటీలు వచ్చాయి. అంతే సింగిల్‌ థియేటర్‌ కథ ముగిసిందన్నారు. ఇప్పుడు 2020లో కరోనా ముట్టడించింది. ఇంతకాలం కష్టాలు పడి బయట పడింది ఓ ఎత్తు. ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాల నుంచి బయట పడడం ఓ ఎత్తు. ఏం జరుగుతుందో చూద్దాం'' అని వ్యాఖ్యానించారు.

కాగా ఇప్పటికీ ‘భారత మాతా సినిమా’ మనుగడ సాగించడానికి టిక్కెట్‌ ధర అతి తక్కువగా ఉండడం.. ఎక్కువగా మరాఠీ చిత్రాలను ఆడించడమే కారణమని చెప్పవచ్చు. ఏ థియేటర్ లో టాప్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధర కేవలం 80 రూపాయలే. ఒకప్పుడు 750 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటైన ఆ సినిమా హాలు సీట్ల ఆధునీకరణ వల్ల 600 సీట్లకు పరిమితమైంది. థియేటర్ నష్టాల్లో ఉండటంతో సినిమా హాలు శాశ్వతంగా మూసివేసి అక్కడ మరో వ్యాపారం నిర్వహించాలంటే అందుకు చట్టం అనుమతించడం లేదట. 1992లో తీసుకొచ్చిన చట్ట ప్రకారం ఓ సినిమా హాలును మూసివేసినట్లయితే ఆ స్థలంలో మూడోవంతు స్థలంలోనైనా మరో సినిమా థియేటర్‌ నిర్మించాలి. అందుకనే సింగిల్‌ థియేటర్లు మూత పడిన చోట పుట్టుకొచ్చిన మల్టీఫ్లెక్స్‌ లు వెలిశాయి. అయితే అంత స్థలం తనకు లేకపోవడం వలన 'భారత మాతా సినిమా' హాలును మూసివేయలేక పోతున్నానంటూ కపిల్‌ చెప్పుకొచ్చారట. దీనితో పాటు ముంబై నగరంలోని దాదాపు వంద సింగిల్‌ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఇలాగే ఉందట. మరి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.