Begin typing your search above and press return to search.

ఇలాంటి రీమేక్‌లు ఆపేస్తే బెటర్

By:  Tupaki Desk   |   8 Feb 2023 8:00 AM GMT
ఇలాంటి రీమేక్‌లు ఆపేస్తే బెటర్
X
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్ అన్నది సంబంధం లేదు. అన్ని చోట్లా రీమేక్‌లకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. వీటి సక్సెస్ రేట్ రోజు రోజుకూ తగ్గిపోతోంది. ఉన్నదున్నట్లుగా తీసినా.. ఆయా భాషల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసినా.. ఫలితం మారట్లేదు. ఒకటీ అరా సినిమాలు తప్ప మంచి ఫలితాన్ని అందుకున్న రీమేక్‌లు అరుదు. ఓటీటీల్లో అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో.. రీమేక్ అనగానే సగం ఆసక్తి చచ్చిపోతోంది. ఒకప్పుడు రీమేక్‌లతో స్టార్ హీరోలు పెద్ద పెద్ద హిట్లు కొట్టారు.

ఇప్పుడు అదే హీరోలు రీమేక్‌లు చేస్తుంటే అభిమానులే వద్దు మొర్రో అని గొడవ చేస్తున్నారు. తెలిసిన కథలోతమ హీరోలను చూడడానికి వాళ్లు ఏమాత్రం ఇష్టపడట్లేదు. కనీసం స్టార్ హీరోలు రీమేక్‌లు చేస్తున్నపుడు వారి ఇమేజ్‌కు తగ్గట్లు కథలను మారుస్తున్నారు. ఫ్యాన్ మూమెంట్స్ జోడిస్తున్నారు. మాస్ టచ్ ఇస్తున్నారు. అవి ఓ మోస్తరుగా అయినా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

కానీ చిన్న, మిడ్ రేంజ్ సినిమాలను రీమేక్ చేస్తుంటే రిజల్ట్ మరీ దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా చిన్న పాయింట్ మీద లేదా ఒక ట్విస్టు మీద ఆధారపడి నడిచే చిత్రాలను రీమేక్ చేస్తే అవి దారుణాతి దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి. ఈ ఓటీటీ రోజుల్లో ఫలానా భాషలో ఒక సినిమా బాగుందని సోషల్ మీడియాలో టాక్ బయటికి రాగానే జనం హడావుడిగా చూసేస్తున్నారు. ఆ తర్వాత సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. దీంతో కథతో పాటు ట్విస్టులన్నీ రివీల్ అయిపోతున్నాయి.

ప్లాట్ పాయింట్, ట్విస్టులాంటివి ముందే తెలిశాక.. ఇక ఇలాంటి చిన్న సినిమాలను ఎవ్వరైనా ఎందుకు చూస్తారు. ఫలితంగానే ఈ టైపు సినిమాలు అస్సలు వర్కవుట్ కావట్లేదు. తాజాగా ‘కప్పెలా’ రీమేక్ ‘బుట్టబొమ్మ’ ఇలాగే బోల్తా కొట్టేసింది. ఆ సినిమాకు క్లైమాక్సులో వచ్చే ట్విస్టే ఆయువుపట్టు. అదేంటో ముందే తెలుసుకుని థియేటర్లలోకి అడుగు పెట్టిన ప్రేక్షకులకు సినిమా ఏమాత్రం ఆసక్తి కలిగించలేకపోయింది.

మిస్ కాస్టింగ్ కూడా ప్రతికూలంగా మారి సినిమా దారుణంగా బోల్తా కొట్టేసింది. మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన జోసెఫ్ (శేఖర్), ఇష్క్ (ఇష్క్) లాంటి సినిమాల పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమాల ఫలితాలు చూసి అయినా.. ఇలాంటి రీమేక్‌లు ఆపేస్తే మంచిది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.