బతుకమ్మ తెలంగాణ (నైజాం) సంస్కృతి. ఇది వారసత్వ పండుగ. చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర. నేలను ముద్దాడి గంగను స్పర్శించి పుట్ట మన్నును పూజించే తెలంగాణ గట్టుపైన.. పూలను కొలిచే అరుదైన సంప్రదాయం 'బతుకమ్మ'. 'బతుకమ్మ సంబురం'లో ఆడపడుచుల సందడి.. ఆత్మీయ పలకరింపు కనిపిస్తయి. చీరె.. సారె పెట్టి ఒడిబియ్యం పోసినట్లు తీరొక్క పూలతో అలంకరించగా.. సింగిడి రంగుల్లాంటి ప్రజలను ఒక్కటి చేసేది బతుకమ్మ.
వాడిపోయిన ప్రేమలు బతుకమ్మ వేడుకలో చిగురించేవేళ... బాసిపోయిన బంధాలెన్నో బలపడి నిలబడే వేళ... కంచెలు.. ఏర్లను దాటుకొని ఉరిమే ఉత్సాహంతో 'ఇచ్చుకుందాం పుచ్చుకుందాం'అని వాయినమియ్యగా చీకటి బతుకులెన్నో నేరుగా వెలుగు వాకిట్లోకి వచ్చి 'బతుకమ్మా.. బతుకునీయమ్మా' అని తపిస్తాయి. ఒక అందమైన జనపదుల సంస్కృతి.. సంప్రదాయాలు.. జీవన విధానం గురించి బతుకమ్మ సంబురం అన్నివేళలా తెలుగు వారికి ప్రత్యేకమైనది.
బతుకమ్మ గురించి ఇప్పుడే ఎందుకు ప్రస్థావించాల్సి వచ్చింది అంటే? ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డమ్ ని కోరుకుంటున్న సల్మాన్ భాయ్ నేరుగా నైజాం నట్టింట అడుగుపెట్టబోతున్నాడు. తెలుగు వారిని పలకరించబోతున్నాడు. అందుకు సాక్ష్యం ఇదిగో ఈ 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..' పాట. భాయ్ మూడు దశాబ్ధాల కెరీర్ లో ఎన్నడూ లేని సరికొత్త ప్రయోగమిది. నైజాం బతుకమ్మ సంబరాల్లోకి అతడికి సాధర స్వాగతం పలుకుతున్నది ఎవరో తెలుసా? ఇంకెవరు? దగ్గుబాటి వెంకటేష్ - భూమిక- పూజా హెగ్డే అండ్ టీఎస్ ఫ్యామిలీ. భాయ్ తెలుగు గడ్డపై అడుగుపెట్టిన వైనం కూడా ఎంతో ఆసక్తిని కలిగించింది.
అతడు రెగ్యులర్ బాలీవుడ్ ట్రెడిషన్ కి భిన్నంగా ఈ పాటలో కనిపించాడు. తనను తాను ఒక నైజాం యువకుడిగా మలుచుకుని జరీ అంచు పంచె కట్టు.. భుజంపై జరీ అంచు కండువా (తువ్వాలు)తో కనిపించాడు. చుక్కల చొక్కాయ్ లో టింగురంగడిలా ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ నైజాం పెద్దగా భాయ్ కి ఆహ్వానం పలుకుతూ కనిపించగా.. భూమిక నడివయస్కురాలిగా కనిపిస్తుంటే.. పూజా హెగ్డే నైజాం కన్నియగా.. అచ్చం బుట్టబొమ్మనే తలపిస్తోంది. పువ్వుల పండుగలో అటూ ఇటూ చూస్తూ భాయ్ రాక కోసం వేచి చూస్తూ సిగ్గుల మొగ్గయిపోతూ నర్తించిన తీరు ఆకట్టుకుంది.
21 ఏప్రిల్ ఈద్ కానుకగా తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ ' విడుదలకు సిద్ధమవుతోంది. ఇతర సౌత్ భాషల్లోను కిసీ కా భాయ్ చిత్రాన్ని విడుదలవుతుందని సమాచారం. ఫర్హాద్ సామ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్- వెంకటేష్- జగపతిబాబు- పూజా హెగ్డే- షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'బతుకమ్మ..'పాటతో ప్రచార జాతర మొదలెట్టారు. ఇకపై ఇంకా సౌత్ ని తెలుగు రాష్ట్రాల్లోని యువతరాన్ని టచ్ చేసే గ్లిమ్స్ ఏదైనా ఉంటుందేమో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.