Begin typing your search above and press return to search.

ఇదంతా కృష్ణవంశీగారి పుణ్యమే: 'బంగార్రాజు' డైరెక్టర్!

By:  Tupaki Desk   |   18 Jan 2022 8:30 AM GMT
ఇదంతా కృష్ణవంశీగారి పుణ్యమే: బంగార్రాజు డైరెక్టర్!
X
టాలీవుడ్ లో యువ దర్శకుల మధ్య ఇప్పుడు గట్టి పోటీ ఉంది. దాంతో ఎవరికి వారు కొత్త కథలతో సెట్స్ పైకి వెళుతున్నారు. హిట్ తప్పుంచుకోవడానికి వీల్లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ సినిమా గురించే అంతా మాట్లాడుకునేలా చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అలా కల్యాణ్ కృష్ణ ఈ సంక్రాంతి బరిలో 'బంగార్రాజు'ను నిలబెట్టేసి, భారీ వసూళ్లను రాబడుతున్నాడు. 'సోగ్గాడే చిన్నినాయనా'తో నాగార్జునకి తిరుగులేని హిట్ ఇచ్చిన ఆయన, మళ్లీ ఇంతకాలానికి అదే నేపథ్యంతో మరో హిట్ ను ఆయన ఖాతాలో జమచేశాడు.

తాజాగా 'బంగార్రాజు' కథానాయిక కృతి శెట్టితో కలిసి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అభిమానులతో అనేక విషయాలను పంచుకున్నాడు. "చిన్నప్పుడు నేను ఎక్కువగా చిరంజీవి సినిమాలను చూసేవాడిని. ఆ సమయంలో నాకు యాక్టర్ ని కావాలనిపించేది. అలా నేను కాలేజ్ కి వచ్చేసరికి యాక్టింగ్ వైపు కాకుండా డైరెక్టర్ ని కావాలనే పిచ్చిపట్టింది. అప్పటి నుంచి ఆ దిశగా సినిమాలను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. ఇంట్లో చెబితే చదువు పూర్తిచేసి వెళ్లామన్నారు. అలా పీజీ పూర్తి చేసిన తరువాత ఇటువైపు వచ్చాను.

చిన్న సినిమా అయినా .. పెద్ద సినిమా అయినా సినిమాను బట్టి డైరెక్టర్ ను ఇష్టపడుతూ ఉంటాను. అలా మణిరత్నం గారు .. వర్మగారు అంతా నచ్చుతారు. అయితే నాకు సినిమా పిచ్చి బాగా పెరుగుతున్న సమయంలో కృష్ణవంశీ గారి సినిమాలు నాపై ఎక్కువ ప్రభావం చూపించాయి. 'గులాబీ' .. 'నిన్నేపెళ్లాడుతా' .. 'సిందూరం' అంటే నాకు చాలా ఇష్టం. ఒక రకంగా ఇండస్ట్రీకి ఆయన లాక్కొచ్చినట్టే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడు నాగార్జునగారికి ఒక కథ చెప్పాను. అయితే అప్పటికి ఆయన 'మనం' సినిమా చేస్తున్నారు.

నేను చెప్పిన కథలోని హీరో ఏజ్ గ్రూప్ .. 'మనం' సినిమాలోని ఆయన పాత్ర ఏజ్ గ్రూప్ కి దగ్గరగా ఉండటంతో నాగార్జునగారు ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలోనే 'సోగ్గాడే చిన్నినాయనా'కి సంబంధించిన డిస్కస్ జరుగుతూ ఉండేది. ఆ సినిమాకి ఫస్టు డైర్టెకర్ ను నేను కాదు. చాలామంది దర్శకులు ఆ స్క్రిప్ట్ పై వర్క్ చేసి ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ను నాకు అప్పగించి దానిపై వర్క్ చేసి తీసుకుని రమ్మన్నారు. ఆ స్క్రిప్ట్ పై 15 రోజులు వర్క్ చేసి తీసుకొచ్చి నాగార్జున గారికి వినిపించాను. ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయి కారెక్కారు. నచ్చేలేదేమోనని నేను అనుకున్నాను. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి ''కల్యాణ్ మనం ఈ సినిమా చేస్తున్నాం" అన్నారు. అలా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది" అని చెప్పుకొచ్చాడు.