Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : బంగార్రాజు

By:  Tupaki Desk   |   15 Jan 2022 5:24 AM GMT
మూవీ రివ్యూ : బంగార్రాజు
X
చిత్రం : 'బంగార్రాజు'

నటీనటులు: అక్కినేని నాగార్జున-నాగచైతన్య-రమ్యకృష్ణ-కృతిశెట్టి-నాగబాబు-రావు రమేష్- సంపత్-జీపీ-వెన్నెల కిషోర్-బ్రహ్మాజీ-సిమ్రత్ కౌర్-ఫరియా అబ్దుల్లా-మీనాక్షిదీక్షిత్-వేదిక తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: యువరాజ్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
నిర్మాణం: జీ స్టూడియోస్-అన్నపూర్ణ స్టూడియోస్
కథ-మాటలు-దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల

ఈ సంక్రాంతికి అందరి దృష్టినీ అమితంగా ఆకర్షిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఆరేళ్ల కిందట సంక్రాంతికే వచ్చి ఘనవిజయం సాధించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ఇది సీక్వెల్. దాని లాగే మంచి ఎంటర్టైనర్ లాగా కనిపించిన ‘బంగార్రాజు’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

బంగార్రాజు (నాగార్జున) కొడుకైన రాముకు బిడ్డ పుట్టాక అతడి భార్య పురిట్లోనే చనిపోతుంది. దీంతో ఆ బిడ్డను తన తల్లి సత్తెమ్మ (రమ్యకృష్ణ)కు అప్పగించేసి అమెరికా వెళ్లిపోతాడు రాము. తన మనవడికి భర్త పేరైన బంగార్రాజు అని పెట్టి అతణ్ని అల్లారు ముద్దుగా పెంచుతుంది సత్తెమ్మ. అచ్చం తాత లాగే రసికుడిగా మారిన చిన్న బంగార్రాజు.. పెళ్లీడుకొచ్చేసరికి సత్తెమ్మ చనిపోయి బంగార్రాజు దగ్గరికే వెళ్లిపోతుంది. దీంతో చుట్టూ ఉన్న బంధువులంతా బంగార్రాజును అమాయకుణ్ని చేసి మోసాలకు పాల్పడుతుంటారు. అదే సమయంలో అతడి పెళ్లి ఒక సమస్యగా మారుతుంది. మరోవైపు చిన్న బంగార్రాజును చంపడానికి శత్రువులు తయారవుతారు. ఇవన్నీ తెలిసి అతడికి పెళ్లి చేసి, శత్రువుల దాడి నుంచి కాపాడ్డానికి బంగార్రాజు కిందికి వస్తాడు. దీంతో పాటు అతను నెరవేర్చాల్సిన స్వామి కార్యం కూడా ఉంటుంది. మరి బంగార్రాజు అనుకున్నది సాధించాడా.. చిన్న బంగార్రాజుకు పెళ్లి జరిగిందా.. అతడి ప్రాణాలకు ముప్పు తప్పిందా అన్నది తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ:

‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ తీయాలని ఆ సినిమా రిలీజైనపుడే డిసైడైపోయారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. హీరో నాగార్జున. కానీ ఈ చిత్రానికి స్క్రిప్టు ఒక పట్టాన ఓకే అవ్వలేదు. దీని తర్వాత కళ్యాణ్ తీసిన రెండు సినిమాల కోసం రెండు మూడేళ్ల సమయం పట్టి ఉన్నా.. మిగతా మూణ్నాలుగేళ్లు ఈ కథ మీదే కసరత్తు చేసి చేసి చివరికి నాలుగైదు నెలల ముందే ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఇంతగా కసరత్తు చేశారంటే.. ‘బంగార్రాజు’ ఆషామాషీగా ఉండదని.. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ను మించిన వినోదంతో ముంచెత్తుతారని ఆశిస్తాం. కానీ ఈ సినిమా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన రకం లాగా కనిపిస్తుంది. ‘సోగ్గాడే..’లో ఉన్న వినోదంలో సగం కూడా ఇందులో లేదు అంటే అతిశయోక్తి కాదు.

‘సోగ్గాడే..’కు కథ పరంగా పెద్ద ఆకర్షణేమీ లేకపోయినా.. అందులోని ఎమోషన్లకు ఎంటర్టైన్మెంట్ బాగా ప్లస్ అయింది. కానీ ‘బంగార్రాజు’లో ఈ రెండూ మిస్సయ్యాయి. ముఖ్యంగా ఈ కథకు కేంద్రంగా నిలిచిన చిన్న బంగార్రాజు పాత్ర కానీ.. అందులో నాగచైతన్య నటన కానీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు లేకపోవడం పెద్ద మైనస్. పెద్ద బంగార్రాజుగా నాగ్ వీలైనంత మేర ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసినా.. పాటలు-ఫైట్లు లాంటి అదనపు హంగులు బాగానే కుదిరినా.. చైతూ పాత్ర మిస్ ఫైర్ కావడం.. ఎంటర్టైన్మెంట్ డోస్ సరిపోకపోవడంతో ‘బంగార్రాజు’ సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.

నాగచైతన్య మంచి నటుడిగా రుజువు చేసుకున్నాడు కానీ.. పాత్రల విషయంలో అతడికి కొన్ని పరిమితులున్నాయి. లవర్ బాయ్ పాత్రలైనా.. సీరియస్ క్యారెక్టర్లయినా అతను చాలా బాగా చేస్తాడు. కానీ తన తండ్రి, తాతల్లాగా రొమాంటిక్ క్యారెక్టర్లను పండించమంటే మాత్రం కష్టమే. బేసిగ్గానే అతను చాలా సీరియస్ గా.. రిజర్వ్డ్ గాకనిపిస్తాడు. వ్యక్తిగతంగా ఉన్న ఆ ఇమేజ్ కూడా తెరపై ప్రతిబింబిస్తుంటుంది. అందుకే చిన్న బంగార్రాజు పాత్రలో ఎక్కడా కూడా అతను మెరుపులు మెరిపించలేకపోయాడు. కథంతా ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంటే.. దానికి తగ్గట్లుగా చైతూ కొంటెతనాన్ని ప్రదర్శించలేకపోవడం.. రొమాన్స్ పండించలేకపోవడంతో చాలా సన్నివేశాలు తేలిపోయాయి. ఇలాంటి పాత్రలకు రొమాంటిక్ ఇమేజ్ కూడా చాలా అవసరమని నాగార్జునను చూస్తే అర్థమవుతుంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో నాగ్ బంగార్రాజుగా ఎంత ఎంటర్టైన్ చేశాడో తెలిసిందే.

రాముగా అమాయక పాత్రలోనూ ఓకే అనిపించాడు. ఇక ‘బంగార్రాజు’ విషయానికి వస్తే.. అచ్చంగా బంగార్రాజు లాంటి వాడే అంటూ చిన్న బంగార్రాజుగా చైతూ పాత్రను పరిచయం చేస్తారు. అంతకంటే ముందు స్వర్గంలో అప్సరసలతో పెద్ద బంగార్రాజుగా నాగ్ చేసే సందడి భలే సరదాగా అనిపించాక.. చిన్న బంగార్రాజు పాత్ర నుంచి ఎంతో ఆశిస్తాం. కానీ ఆ పాత్ర ఆరంభంలో కాస్త మెరుపులు మెరిపించి తర్వాత చల్లబడిపోతుంది. బాబు బాగా రొమాంటిక్ అని వేరే పాత్రలు అనుకోవడం తప్ప చైతూ పాత్ర ద్వారా రొమాన్స్ పండించడానికి ప్రయత్నమే జరగలేదు. తలా తోకా లేనట్లుగా తయారైందా పాత్ర.

ఇక ‘సోగ్గాడే..’లో రాము-అతడి భార్యకు సంబంధించిన ఎపిసోడ్లో మంచి ఎమోషన్ కనిపిస్తుంది. వాళ్ల మధ్య సమస్యను ఎస్టాబ్లిష్ చేసిన తీరు.. తర్వాత ఆ సమస్య పరిష్కారమయ్యే క్రమంలో మంచి సన్నివేశాలు పడ్డాయి. కానీ ఇక్కడ చిన్న బంగార్రాజు-నాగలక్ష్మిల ఎపిసోడ్ పరమ బోరింగ్ గా అనిపిస్తుంది. ప్రెసిడెంటుగా కృతి పాత్ర ఆరంభం నుంచే తేలిపోయింది.

చైతూ-కృతి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఒక్కటీ పండలేదు. ఆరంభం నుంచి చివరి దాకా ఈ ట్రాక్ ఎక్కడా ఎంగేజ్ చేయదు. నాగ్ పాత్ర కనిపించినపుడల్లా కాస్త ఉత్సాహం వస్తుంది తప్ప ఇంకే విశేషాలు కనిపించలేదు. ముఖ్యంగా కామెడీ ఎక్కడా కూడా కొంచెం కూడా వర్కవుట్ కాలేదు. ‘సోగ్గాడే..’లో బ్రహ్మానందం ట్రాక్ లాగా ఇక్కడ కామెడీ సెటప్ ఏదీ కుదర్లేదు. వెన్నెల కిషోర్ ను సైతం సరిగా ఉపయోగించుకోలేదు. విలన్లను నేరుగా పరిచయం చేయకుండా.. వాళ్లను ముందు మంచోళ్లుగా చూపించి.. ఆ తర్వాత వాళ్ల నిజ స్వరూపాలు బయటపెట్టే స్టయిల్ చాలా పాతదైపోయింది. దీంతో ఆ పాత్రలు కూడా ఎంగేజ్ చేయలేకపోయాయి. ‘సోగ్గాడే..’లో ఉన్న సంపత్ పాత్రను ఇందులో కూడా కొనసాగించారు. కానీ పెద్దగా ప్రయోజనంలేకపోయింది. గుడి చుట్టూ నడిచే వ్యవహారం అంతా ఆల్రెడీ చూసిందే. దానికి కొనసాగింపుగా సాదాసీదాగా సన్నవేశాలు నడిపించేశారు. ప్రథమార్ధంలో కలర్ ఫుల్ గా సాగే పాటలు.. బంగార్రాజు పాత్ర చేసే కాస్త సందడి మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది.

ద్వితీయార్ధం కాస్త నయంగా అనిపిస్తుంది. క్లైమాక్సులో ఒక సర్ప్రైజ్ నాగ్ అభిమానులను.. అలాగే మాస్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా మొత్తంలో ఎగ్జైటింగ్ గా అనిపించేది ఆ సర్ప్రైజ్ మాత్రమే. పెద్దగా అంచనాల్లేనపుడు ‘సోగ్గాడే చిన్నినాయనా’లో బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన నాగ్-కళ్యాణ్.. ఈసారి అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయారు. పండక్కి సూటయ్యే పల్లెటూరి సినిమా కావడం.. పెద్దగా పోటీ లేకపోవడం.. నాగ్ సహా కొన్ని ఆకర్షణలు ఉండటం వల్ల ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ దగ్గర కొంత సందడి చేయొచ్చేమో కానీ.. ‘సోగ్గాడే. చిన్నినాయనా’ లాగా అద్భుతాలు చేయడం మాత్రం కష్టమే.

నటీనటులు:

నాగార్జున కెరీర్లో బంగార్రాజు పాత్ర కచ్చితంగా చాలా ప్రత్యేకమైందే. నాగార్జున ఇమేజ్ కు ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఆయన మరోసారి ఆ పాత్రను అలవోకగా చేసుకుపోయారు. నాగ్ దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ ఎంగేజ్ చేశాడు. అమ్మాయిలతో ఆయన సయ్యాటలు సరదాగా అనిపిస్తాయి. కాకపోతే ఇదంతా ఆల్రెడీ ‘సోగ్గాడే..’లో చూసిందే కాబట్టి కొత్తగా అయితే అనిపించదు. నాగచైతన్య చిన్న బంగార్రాజుగా మెప్పించలేకపోయాడు. పాత్రకు అవసరమైన కొంటెతనాన్ని అతను చూపించలేకపోయాడు. ఇక్కడే నాగార్జునకు.. చైతూకు మధ్య తేడా తెలుస్తుంది. చైతూ ఆహార్యం కూడా సాధారణంగా అనిపిస్తుంది. ఇతను బంగార్రాజు టైపే అన్న ఫీలింగే ఎక్కడా ఆ పాత్ర కలిగించలేదు. రమ్యకృష్ణ సత్తెమ్మగా మరోసారి మెప్పించింది. కృతి శెట్టి చాలా సాధారణంగా అనిపిస్తుంది. నటన పరంగా ఆమె బలహీనతలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపించాయి. ఆమె ముఖంలో హావభావాలు పలకలేదు. అందంతో మాత్రం ఆకట్టుకుంది. రావు రమేష్ ఓకే. విలన్ పాత్రల్లో సంపత్.. జీపీ పర్వాలేదు. యముడిగా నాగబాబు బాగానే కుదిరాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

అనూప్ రూబెన్స్ పాటలు సోసోగా అనిపిస్తాయి. పాటల విషయంలో ప్రేక్షకులు కచ్చితంగా ‘సోగ్గాడే చిన్నినాయనా’తో పోల్చిచూస్తారు. కానీ ఆ స్థాయిలో అయితే ఆల్బమ్ లేదు. లడ్డుండా.. బంగారా పాటలు కొంచెం ఎంటర్టైనింగ్ గానే సాగాయి. కానీ అవి గుర్తుండేవైతే కావు. నేపథ్య సంగీతం ఓకే. యువరాజ్ ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. పాటలు సహా అన్ని చోట్లా విజువల్స్ కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగా కుదిరాయి. కళ్యాణ్ కృష్ణ.. సత్యానంద్ కలిసి వండిన స్క్రిప్టు ఆశించిన స్థాయిలో మెరుపులు లేవు. కథ పరంగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించరు కానీ.. వాళ్లు కోరుకునే వినోదాన్ని అందించడంలో కళ్యాణ్.. సత్యానంద్ విఫలమయ్యారు. ఆల్రెడీ క్లిక్ అయిన పెద్ద బంగార్రాజు పాత్రను బాగానే ఎక్స్టెండ్ చేయగలిగారు కానీ.. చిన్న బంగార్రాజు పాత్రను సరిగా తీర్చిదిద్దలేదు. ఎంటర్టైన్మెంట్ విషయంలో కళ్యాణ్ చమక్కులన్నీ అయిపోయాయనిపిస్తుంది. అతడి నరేషన్ ఓల్డ్ స్టయిల్లో సాగింది. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: బంగార్రాజు.. మెరుపులు తగ్గాయ్

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre