Begin typing your search above and press return to search.

తొలిసారి ఓటీటీ తర్వాత థియేటర్లో సందడి.. ఆ సినిమా ప్రత్యేకత ఏమిటి?

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:05 AM GMT
తొలిసారి ఓటీటీ తర్వాత థియేటర్లో సందడి.. ఆ సినిమా ప్రత్యేకత ఏమిటి?
X
కరోనాకు ముందు ఓటీటీ అంటే తెలిసినోళ్లు చాలా తక్కువ మంది. ఆ మహమ్మారి దెబ్బకు నెలల పాటు ఇంటి వద్దే ఉండిపోయిన కారణంగా.. జనాల జీవితాల్లోకి దూసుకొచ్చిన కొత్త విషయాల్లో ఓటీటీ ఒకటి. అప్పటివరకు ఉన్న వినోదాలకు అదనంగా చేరటమే కాదు.. అత్యంత వేగంగా తనవైపునకు తిప్పేసుకున్న మాథ్యమం. అప్పటి నుంచి థియేటర్ లో సినిమా చూసే వారిలో కొంతమంది ఓటీటీలో చూద్దాం.. థియేటర్ వద్దంటూ ఫిక్స్ నోళ్లు చాలామందే ఉన్నారు. మారిన తీరుకు అనుగుణంగా కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీలకు అమ్మేసుకొని బయటపడినోళ్లు చాలామందే ఉన్నారు.

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి థియేటర్లనే కాదు.. ఓటీటీలను సైతం ముంచేసే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. కొన్ని క్రేజీ మూవీలు సైతం సినిమాను విడుదల చేసే విషయంలో థియేటర్ల లభ్యత.. దాని ప్రచారం లాంటి తలనొప్పులు ఎందుకు? ఫ్యాన్సీ ధరతో టేబుల్ ప్రాఫిట్ తీసేసుకుందామని ఆలోచిస్తూ.. ఓటీటీలకు అమ్మేసే వారు మొదలయ్యారు. అదో అలవాటుగా మారిన వేళ.. రోటీన్ కు భిన్నంగా ఓటీటీలో విడుదలయ్యాక కొన్ని రోజులకు సినిమా థియేటర్ లో అదే సినిమాను విడుదల చేసేంత క్రేజ్ తెచ్చుకున్న మొదటి సినిమా బాలీవుడ్ 'బందా'. ఇక్కడో క్వశ్చన్ వేయొచ్చు. మరి మన 'కలర్ ఫోటో' సంగతేమిటని. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక కొన్ని నెలల తర్వాత థియేటర్లలో విడుదలైతే.. బందా అందుకు భిన్నంగా వారం వ్యవధిలో విడుదలైంది.

సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ రోటీన్ కు భిన్నంగా ఓటీటీ నుంచి థియేటర్ కు వచ్చేసిన ఈ మూవీ కొత్త ఫార్మాట్ కు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పాలి. బాలీవుడ్ నటుల్లో విలక్షణ నటనను అందించే కొద్ది మంది నటుల్లో ముందుంటే మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం''సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై''. కోర్టు బ్యాక్ డ్రాప్ గా తీసిన ఈ మూవీకి అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. జీ5 ఓటీటీలో మే 23న విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు ముంబయిలోని కొన్ని ప్రాంతాల్లోని థియేటర్లలో విడుదలై.. మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.

పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక బాబా తనను వేధింపులకు గురి చేశాడంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించటం.. ఆమె మాటల్ని ఎవరూ వినకపోవటం.. అదే సమయంలో ఆమె వేదనను గుర్తించిన ఒక లాయర్ (మనోజ్ బాజ్ పాయ్) ఆమెను తన ఇంట్లో ఆశ్రయాన్ని ఇచ్చి కేసు టేకప్ చేస్తాడు. అనంతరం ఆ బాబా మాయలో పడి ఎంతో మంది యువతులు వేధింపులకు గురి అవుతున్న విషయాన్ని గుర్తించి న్యాయపోరాటం చేస్తాడా లాయర్. దాదాపు ఐదేళ్లు న్యాయపోరాటం ఏమవుతుందన్నది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే.. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనంతనే దేశంలోనే ఒక ప్రముఖ ఆశ్రమం చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు పంపటంతో ఈ మూవీకి బజ్ ఒక్కసారి పెరిగింది. ఇప్పటివరకు ఈ మూవీని 200 మిలియన్లకు పైగా వాచ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. మరి.. ఈ వీకెంట్ ప్లాన్ చేస్తున్నారా?