శకపురుషుడు : ఎన్టీయార్ తో బాలయ్య

Sun May 22 2022 08:00:01 GMT+0530 (IST)

Balayya NTR

ఎన్టీయార్ చిర స్మరణీయుడు. తెర స్మరణీయుడు. ఆయన లేరు అన్నది ఎవరూ ఊహలో కూడా అసలు అనుకోలేరు. ఎందుకంటే రాజకీయాలలో ఆయన ముద్ర ఉంది. సినిమా ఊసులో ఆయన ధ్యాస ఉంది. టీవీలలో నిత్యం పాత సినిమాలలో ఆయన కనిపిస్తూనే ఉంటారు. పోయి ఇప్పటికి ఇరవై ఆరు ఏళ్ళు అయింది. పుట్టి వందేళ్ళు అయింది. అయినా సరే ఎన్టీయార్ అన్న మూడు అక్షరాలు తెలుగు జాతినీ ఎపుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటాయి.అలాంటి ఎన్టీయార్ ని శకపురుషుడుగా అంతా అభివర్ణిస్తారు. అందుకే ఆయన అసలు సిసలు వారసుడు నందమూరి బాలక్రిష్ణ శకపురుషుని శత జయంతి వేడుకలు అంటూ తెలుగు జాతికి తీయని కబురు చెప్పారు. ఏడాది పాటు ఎన్టీయార్ శత జయంతి వేడుకలు తెలుగు నేల నలు చెరగులా  మాత్రమే కాకుండా దేశ విదేశాలలో అంతటా జరుగుతాయని చెప్పుకొచ్చారు.

ఈ శతజయంతి వేడుకల ఏడాది ఉత్సవాలకు బాలయ్య చైర్మన్ గా వ్యవహిరిస్తున్నారు. గౌరవ చైర్మన్ గా అన్న జయక్రిష్ణ ఉంటే కన్వీనర్ గా అక్క కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. మొత్తానికి బాలయ్య పూనుకుని చేస్తున్న మహత్తర కార్యక్రమం ఇది. తనను ఇంతటి వాడిని చేసిన తండ్రి గారికి బాలయ్య అందిస్తున్న నీరాజనం ఇది.

ఇందులో మొత్తం అన్న గారి సంతానం పదకొండు మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఆ విధంగా చూస్తే ఎక్కడా చంద్రబాబు కానీ చినబాబు కానీ ప్రస్థావన లేదు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా లేరు. కేవలం ఎన్టీయార్ కొడుకులు కుమార్తెలు కోడళ్ళు భుజనా వేసుకుని చేస్తున్న కార్యక్రమం ఇది.  ఈ మొత్తం కార్యక్రమం అంతా బాలయ్య నాయకత్వంలో జరుగుతోంది.

ఇక ఎన్టీయార్ పుట్టిన నిమ్మకూరు వెళ్ళి ఆ గడ్డకు దండం పెట్టి బాలయ్య ఈ నెల 28న ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆ మీదట తెనాలి లోనూ సందడి చేస్తారు. ఇదిలా ఉంటే బాలయ్య టీడీపీతో ఎమ్మెల్యే. పార్టీలో  పొలిట్ బ్యూరో మెంబర్. కానీ ఇది కేవలం ఫ్యామిలీ నాయకత్వంలోనే జరుగుతున్న ప్రోగ్రాం కావడమే ఇక్కడ విశేషం.

అయితే ఇది అసహజం అయితే కాదు  పైగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. బాలయ్య ప్రముఖ సినీ నటుడు. టాలీవుడ్ టాప్ సీనియర్లలో ఒక పిల్లర్. ఆయన సినీ రంగం తరఫున కూడా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు అనుకోవాలి. ఇక ఎన్టీయార్ వారసుడిగా ఆయన సినీ రంగాన రాణిస్తున్నారు. అదే టైమ్ లో రాజకీయాల్లో వారసుడిగా మాత్రం లేరు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ వేవ్ లో కూడా తట్టుకుని బాలయ్య 2019లో గెలిచారు. అయినా కనీసం మంత్రి కూడా కాలేకపోయారు. టీడీపీకి ఈ రోజుకీ చంద్రబాబే నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తరువాత అంటే చినబాబును చూపిస్తున్నారు. మధ్యలో ఉన్న బాలయ్య గురించి ఎవరూ మాట్లాడడం లేదు. నా వయసు 72 కాదు 27 అంటున్న చంద్రబాబు ఈ రోజుకీ పాతికేళ్ళ హీరోగా వెండితెర మీద వెలుగుతున్న బావమరిది గురించి ఆలోచించడం లేదు అన్న విచారం అయితే ఫ్యాన్స్ లో ఉంది.

బాలయ్యకు మనసులో  ఏముందో  తెలియదు కానీ ఎన్టీయార్ రెండు కీలక రంగాల్లో రాణిస్తే బాలయ్య మాత్రం సినీ రంగంలోనే సత్తా చాటగలిగారు. మరి శకపురుషునికి వందనం చెబుతూ నిర్వహిస్తున్న శతజయంతి వేడుకలు అయినా బాలయ్యకు రాజకీయంగా జవం జీవం అందిస్తాయా అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం.

అదే విధంగా బాలయ్య నా వారసుడు అని అప్పుడెపుడో అంటే 1987లో మదనపల్లిలో ఎన్టీయార్ అన్న మాటలు రీ సౌండ్ చేస్తూ ఫ్యాన్స్ చెవుల్లోనే ఇప్పటికీ  అలా ఉన్నాయి. మరి బాలయ్య వాటిని నిజం చేస్తారా.  తనను తాను రుజువు చేసుకుంటారా. ఏది ఏమైనా బాలయ్యకు కొండంత అండగా ఎన్టీయార్ ఉన్నారు. అలాగే ఎన్టీయార్ తో బాలయ్య ఉన్నారు. అంతకంటే అద్భుత శక్తి వేరొకటి లేదు కూడా.