ఇదేం ఆవేశం బాలయ్య? అత్యున్నత పురస్కారం కాలిగోటితో.. చెప్పుతో సమానమా?

Wed Jul 21 2021 09:41:46 GMT+0530 (IST)

Balakrishna Sensational Comments on Bharat Ratna Award

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ. ఎప్పుడో ఒకసారి మాత్రమే బయటకు వచ్చే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు.. చేతలు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి వార్తల్లోకి వచ్చేశారు బాలయ్య.ఆయన నటించిన ఆదిత్య 369 సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఈ సినిమా గురించి వివిధ చానళ్లలో ఆయన మాట్లాడారు. అప్పట్లో పెను సంచలనంగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాదు.. వాణిజ్యపరంగా సక్సెస్ కావటమే కాదు.. బాలయ్యలోని సరికొత్త నటుడ్ని పరిచయం చేసింది.

ఈ సినిమా తెలుగు సినిమా రేంజ్ ను పెంచటమే కాదు.. వినూత్న కథల్ని ట్రై చేసేలా చేసింది. ఈ సినిమా విశేషాల్ని మాట్లాడే వేళలో.. సినిమా నుంచి పక్కకు వెళ్లిన బాలయ్య.. అనూహ్య వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యున్నత పురస్కారంగా చెప్పే భారరత్నను దివంగత మహానటుడు.. కమ్ నేత అయిన నందమూరి తారకరామారావుకు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. ఇదే విషయాన్ని బాలయ్య వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాసింత ఆవేశానికి గురైన ఆయన.. ‘‘ఏం అవార్డులు వచ్చాయని ఆయన మహనీయుడు అయ్యారు. భారతరత్న రాకపోవటం వల్ల ఆయన కీర్తికి ఎలాంటి భంగం వాటిల్లదు. ఎన్టీఆర్ కు భారతరత్న కాలిగోటితో సమానం. ఆ అవార్డు చెప్పుతో సమానం.

ఆ అవార్డు ఇచ్చినందుకు రామారావుకు గౌరవం కాదు.. ఆయనకు ఇచ్చిన వాళ్లకు ఆ గౌరవం దక్కుతుంది’’ అంటూ ఆవేశంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశ అత్యున్నత పురస్కారాన్ని కించపరిచారన్న విమర్శలు మొదలయ్యాయి.

ఇదే సమయంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు.. భారతీయ సినీ సంగానికి కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిన ఎఆర్ రెహ్మాన్ ఎవరో తనకు తెలీదన్న వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఒకవైపు రెహమాన్ ది ఒక ప్రత్యేకమైన శైలి అంటూనే.. ‘ఆయన ఎవరో నాకు తెలీదు. పదేళ్లకు ఒక హిట్ ఇస్తారు. ఆస్కారర్ అవార్డు అందుకుంటారు. అవార్డులు అందుకున్నంత మాత్రాన గొప్పవాళ్లు కాదు’’ అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకవైపు రెహమాన్ ఎవరో తెలీదంటూనే మరోవైపు ఇలాంటి విమర్శలు చేయటమా? అన్నది ప్రశ్నగా మారింది.

కొత్త తరహా కథలతో సినిమాలు చేసే విషయంలో తామే ట్రెండ్ సెట్టర్స్ అని గొప్పలు చెప్పుకున్నారు బాలకృష్ణ. ఫ్యాక్షనిజం కానీ పౌరాణికం కానీ చారిత్రక చిత్రాలన్ని తాము చేశామని.. ఆదిత్య 369 ఒక విభిన్నమైన సినిమా అని.. అలాంటి సినిమాలు చేయటానికి ఎవరూ సాహసం చేయలేదన్నారు. ఆ సాహసం తానే చేశానని చెప్పిన బాలయ్య.. ‘ఏదైనా హిస్టరీ తిరగరాయాలంటే అది మాకే సాధ్యం’ అంటూ సినిమాటిక్ డైలాగ్ ను చెప్పేయటం విశేషం.

ఆదిత్య 369 సినిమా గురించి చెబుతూ.. సినిమాకు దర్శకుడు.. సంగీత దర్శకుడు.. కీలకంగా వ్యవహరించారని చెప్పిన ఆయన.. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ ప్రాణమన్నారు. తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఏ సినిమాకు పని చేయని విధంగా ఈ సినిమాకు ముగ్గురు ఫోటోగ్రాఫర్లు పని చేశారన్నారు. వీఎస్ఆర్ స్వామి.. కబీర్ లాల్.. పీసీ శ్రీరాం పని చేశారని.. స్వామి షూట్ చేస్తే ఎక్స్ ట్రా సీన్ అనేవి ఉండవన్నారు.