#NBK108: బాలయ్య సరసన జాతీయ ఉత్తమ నటి..?

Sat May 28 2022 22:00:42 GMT+0530 (IST)

Balakrishna Movie NBK108

లేటెస్టుగా 'ఎఫ్ 3' సక్సెస్ తో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తన తదుపరి చిత్రం కోసం నందమూరి బాలకృష్ణ తో జత కట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శక హీరోల సైడ్ నుంచి ఈ విషయం మీద స్పష్టత వచ్చేసింది.ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న #NBK107 సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత అనిల్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి #NBK108 చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఇది తండ్రీ కూతురు మధ్య నడిచే కథ అని.. బాలకృష్ణ ఇందులో యాభై ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో కనిపిస్తారని.. ఆయన కూతురుగా శ్రీలీల నటించనున్నారని తెలిపారు. అయితే ఈ సినిమాలో నటసింహానికి జోడీగా ప్రియమణి కనిపించనున్నారని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

సినిమాలో కీలకమైన కథానాయిక పాత్ర కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించిన అనిల్ రావిపూడి.. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ గ్రహీత ప్రియమణి అయితే ఆ క్యారక్టర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారట.

'అఖండ' సినిమాలో యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తో రొమాన్స్ చేసిన బాలయ్య.. #NBK107 లో శృతిహాసన్ తో జత కడుతున్నారు. అయితే అనిల్ సినిమాలో హీరోది వయసు పైబడిన పాత్ర కావడంతో ప్రియమణి ని తీసుకుంటున్నారని అంటున్నారు.

'నారప్ప' సినిమాలో ముగ్గురు పిల్లల తల్లిగా నటించిన ప్రియమణి.. ఇప్పుడు బాలయ్య చిత్రంలో శ్రీ లీల కు తల్లిగా కనిపించడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చని అంటున్నారు. అందులోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో యంగ్ బాలకృష్ణ తోనూ ఆమె సీన్స్ ఉంటాయట.

గతంలో బాలయ్య మరియు ప్రియమణి కలిసి 'మిత్రుడు' సినిమాలో నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు వీరిద్దరూ రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఇకపోతే బాలకృష్ణ తో చేయబోయే సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అనిల్ రావిపూడి చెబుతున్నారు. పోకిరి - గబ్బర్ సింగ్ - అర్జున్ రెడ్డి లాంటి చిత్రాల మాదిరిగా హీరో క్యారెక్టరైజేషన్ మీద కథ నడుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవ్వరూ చూడని కొత్త కోణంలో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు.

తన మార్క్ కామెడీ మరియు బాలయ్య నుంచి ఆశించే కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ - పవర్ ఫుల్ డైలాగ్స్ పుష్కలంగా ఉండేలా కథని సిద్ధం చేసినట్టు చెప్పారు అనిల్. బాలకృష్ణతో కొత్త ప్రయోగం చేయబోతున్నానని.. ఇది తన కెరీర్ బెస్ట్ వర్క్ గా నిలిచిపోతుందని దర్శకుడు చెప్పుకొచ్చారు.