Begin typing your search above and press return to search.

'నన్ను భరిస్తుంది.. కుటుంబాన్ని భరిస్తుంది.. ఇంట్లో ఆమెనే అన్ స్టాపబుల్'

By:  Tupaki Desk   |   5 Oct 2022 3:49 AM GMT
నన్ను భరిస్తుంది.. కుటుంబాన్ని భరిస్తుంది.. ఇంట్లో ఆమెనే అన్ స్టాపబుల్
X
నందమూరి నటసింహం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ NBK'' టాక్ షోతో డిజిటల్ స్పేస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో ప్రసారమైన ఈ కార్యక్రమానికి విశేష ప్రేక్షకాదరణ లభించింది. అయితే ఇప్పుడు "అన్ స్టాపబుల్" సీజన్-2 తో అలరించేందుకు బాలయ్య రెడీ అయ్యారు.

ఆహా అనిపించే బాలకృష్ణ టాక్ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మంగళవారం విజయవాడలో "అన్‌ స్టాపబుల్-2" లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్‌ గా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రోమో టీజర్ ను ఆవిష్కరించారు. టాలెంటెట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. షోలో తాను అన్ స్టాపబుల్ అయితే, ఇంట్లో మాత్రం తన సతీమణి వసుంధర అన్ స్టాపబుల్ అని అన్నారు. "ఆమె పేరులోనే ఉంది. వసుంధర అంటే భూదేవి. అలానే నాలో సగ భాగం. సగం కంటే ఎక్కువ అని చెప్పాలి. ఆమెనా అదృష్టం. ముందు నన్ను భరిస్తుంది.. నా కుటుంబాన్ని భరిస్తుంది.. అన్ని విషయాలూ చూసుకుంటుంది. అదే మహిళల సాధికారత" అని బాలయ్య అన్నారు.

"నేను సినిమా షూటింగులు లేదా క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు.. హిందూపూర్ నియోజకవర్గ పనులు లేదా ఇతరత్రా విషయాల్లో నిమగ్నమై బిజీగా ఉన్నప్పుడు.. మిగతా అన్ని విషయాలు తనే చూసుకుంటుంది. కాబట్టి ఆమెనే అన్ స్టాపబుల్" అని బాలకృష్ణ తెలిపారు.

"విజయదశమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవాడలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నందమూరి రామారావు గారు జన్మించిన జిల్లాలో నిర్వహించడం కాకతాళీయం. చాలా మంది నేను టీవీల్లో కనిపించడం లేదని నిరుత్సాహానికి గురైన వాళ్లు ఉన్నారు. ఎదురు చూసినవాళ్లు ఉన్నారు. సినిమాల్లోనే కనిపిస్తారు.. టీవీల్లో కనిపించడులే అని అనుకున్న వాళ్లు ఉన్నారు"

"అల్లు అరవింద్ గారి మాటను గౌరవించి 'అన్‌ స్టాపబుల్' షోను చేశా. మనిషిలోని రకరకాల కోణాలను ఆవిష్కరించినప్పుడే ఆ పని సత్ఫలితం సాధిస్తుందనేది నా నమ్మకం. ఆ అవకాశం నాకు ఈ రూపంలో వచ్చింది. అన్ని విషయాలను మనం పాజిటివ్‌ గా తీసుకోవాలి. కేవలం సక్సెస్‌ వచ్చినప్పుడు ఆనంద పడిపోకూడదు.. ఫెయిల్యూర్‌ ను కూడా స్వీకరించాలి. పట్టుదలతో కృషి చేసి మనం మళ్లీ ముందుకు సాగాలి"

"మొదటి సీజన్ కంటే అన్‌ స్టాపబుల్ సీజన్-2 ఎక్కువ హిట్ అవుతుంది. అభిమానులు నా నుంచి ఏమి ఆశించకుండా కురిపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామరక్ష. అభిమానం డబ్బులో కొనలేనిది.. ప్రలోభాలు పెడితే రాదు.. అటువంటి అభిమానాన్ని నేను సంపాదించాను. ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. సినిమాలతో పాటు ఈ మాధ్యమంలో కూడా నేను కొనసాగుతా. నాకు స్ఫూర్తి ప్రదాత 'అన్‌ స్టాపబుల్' షో"

"నేను అడుగువేసిన ఈ రంగాన్ని విజయం చేసిన ఘనత ప్రతి ఒక్కరికీ దక్కుతుంది. 'ఆహా' వాళ్లు చేపట్టిన ప్రతి ప్రోగ్రామ్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను'' అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. నేడు ప్రపంచం ఎంతో మారిపోతోందని.. థియేటర్లు టీవీలు దాటి మన అరచేతిలోకి వచ్చేసిందని అన్నారు. ఇది మన అభిమానుల సత్తా అని.. ఒక బటన్ నొక్కితే చాలు వినోదం మన ముందు ఉంటుందని బాలయ్య పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.