తారక్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే...?

Thu May 28 2020 16:40:55 GMT+0530 (IST)

This Is NTR 30 Movie Title ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ఆర్.ఆర్.ఆర్' సెట్స్ మీద ఉండగానే తారక్ ఈ సినిమా ఓకే చేసాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) - నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసిందట. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఫైనలైజ్ చేశారట. వాస్తవానికి ఈ టైటిల్ ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. కాకపోతే వర్కింగ్ టైటిల్ అయ్యుండొచ్చు అని అనుకున్నారు. అయితే ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ కి 'అ' అక్షరం సెంటిమెంటుగా వస్తుండటంతో అలాంటి పుకారు వచ్చిందేమో అని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న 'అయినను పోయి రావలె హస్తినకు' టైటిల్ కే చిత్ర యూనిట్ ఓటు వేసారంట. త్రివిక్రమ్ గత సినిమాలు 'అతడు' 'అ ఆ' 'అజ్ఞాతవాసి' 'అల వైకుంఠపురంలో' 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రాల టైటిల్స్ 'అ' అక్షరంతో స్టార్ట్ అవుతాయి.ఇదిలా ఉండగా 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత తారక్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ టాప్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తాడట. దీని కోసం క్రేజీ మేక్ ఓవర్ లో ఎన్టీఆర్ వెరీ స్టైలిష్ గా కనిపిస్తాడట. ఆర్.ఆర్.ఆర్ సినిమా కంప్లీట్ చేసిన వెంటనే తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంభందించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. పాన్ ఇండియా మూవీ కావడంతో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అన్నీ కుదిరితే ఈ ఏడాది నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్ లో విడుదల చేయాలని భావించారట. కానీ ఇప్పుడు పరిస్థితులలో ప్లాన్స్ అన్నీ తారుమారు అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.