డిజాస్టర్ సినిమాను సూపర్ హిట్ చేశారు

Wed Mar 29 2023 17:21:41 GMT+0530 (India Standard Time)

Audience Made Disaster Film Super Hit

ఆరెంజ్ ఈపేరు వింటే మెగా అభిమానులకు మాత్రమే కాదు.. మెగా బ్రదర్ నాగబాబుకు సైతం వెన్నులోంచి ఒక రకమైన వణుకు పుడుతుంది. ఎందుకంటే అప్పటికే రెండో సినిమా మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టిన రామ్ చరణ్... ఈ సినిమాతో డిజాస్టర్ టాక్ అందుకున్నాడు. సినిమా ఏంట్రా ఇంత వరస్ట్ గా ఉందనే కామెంట్లు అయితే వచ్చాయి. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన  నాగబాబు అయితే ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఏకంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ అదంతా ఒకప్పటి సంగతి.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తయ్యాయి కూడా. అయితే ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోందంటే ఒకప్పుడు విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుని నిర్మాత ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లడానికి కారణమైన ఈ సినిమాని ఇప్పుడు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు.

వాస్తవానికి ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ లవ్ యాంగిల్ లో తెరకెక్కించారు.  ప్రేమ ఎవరి మీద శాశ్వతం కాదు.. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. అయితే అప్పటి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. అప్పట్లోనే ఈ సినిమా మరీ అడ్వాన్స్డ్ గా ఉంది. మరో 10 15 ఏళ్ల తర్వాత వస్తే అప్పటి యూత్ కి కనెక్ట్ అవుతుందేమో అనే కామెంట్లు వినిపించాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. దాదాపుగా ఈ సినిమా రెండు కోట్ల వరకు రీ రిలీజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు చెబుతున్నారు.

ఒక డిజాస్టర్ సినిమా ఇలా రీరిలీజ్లో ఈ మేరకు వసూళ్లు సాధించడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాదు ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే వారి మధ్యలో నాగబాబు నవ్వుతున్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమాని అప్పుడే హిట్ చేసి ఉంటే నాకు అన్ని బాధలు తప్పేవి కదా అని ఆయన లోపల ఫీల్ అవుతున్నట్టుగా కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజమే ఆ రోజుల్లో ఈ సినిమాని హిట్ చేసి ఉంటే రామ్ చరణ్ కెరియర్ వేరేలా ఉండేదేమో. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిన ఆయన ఇంకా ముందే గ్లోబల్ స్టార్ అయ్యే వారేమో తెలియదు.

అయితే ఈ సినిమాకి ఇంత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూసి డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ సినిమా నాకు తన జీవితంలో ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటుందని రామ్ చరణ్ నాగబాబు సహా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ఆయన థాంక్స్ చెబుతూ ఆ టైమ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేసినట్లు వీడియోలో ఎమోషనల్ అయ్యారు. అంతే కాదండోయ్ ఈ సినిమా రేపు మార్చి 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలబ్రిటీ స్పెషల్ షో కూడా ప్లాన్ చేశారు. సంధ్య 70 ఎంఎం థియేటర్లో రేపు ఉదయం 8 గంటలకి ఈ సెలబ్రిటీ స్పెషల్ షో వెయ్యబోతున్నారు.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.