'అత్రాంగి రే' ట్రైలర్: ధనుష్ - అక్షయ్ ఇద్దరినీ ప్రేమిస్తున్న సారా..!

Wed Nov 24 2021 19:01:09 GMT+0530 (IST)

Atrangi Re Official Trailer

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 'రాంఝానా' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి నార్త్ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టారు. ఇదే క్రమంలో అమితాబ్ తో కలిసి 'షమితాబ్' సినిమా చేసిన ధనుష్.. చాలా గ్యాప్ తర్వాత ''అత్రంగి రే'' అనే హిందీతో చిత్రంతో పలకరించబోతున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ - సారా అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్ వేదికగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'అత్రంగి రే' ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ట్రైలర్ విషయానికొస్తే.. ధనుష్ ని కొందరు బస్తాలో మూతగట్టుకొని రావడంతో ప్రారభమైంది. మగరాయుడిగా తిరిగే సారా అలీఖాన్ ను ఎవరు దొరికితే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని డిసైడైన కుటుంబ సభ్యులు.. తమిళ తంబీ ధనుష్ ను బంధించి తీసుకొస్తారు. ఏమాత్రం పరిచయంలేని వారిద్దరికీ బలవంతంగా వివాహం జరిపిస్తారు.

ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని ఒకరికొకరు తెలుసుకున్న ధనుష్ - సారా.. ఢిల్లీకి వెళ్లిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుంటారు. కానీ కాలక్రమంలో సారాను ధనుష్ ప్రేమించడం మొదలుపెడతాడు. సారా కూడా ధనుష్ ఇష్టపడుతుంది. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న సమయంలో అక్షయ్ కుమార్ ఎంట్రీతో కథలో పెద్ద మలుపు తిరిగింది.

అదేంటంటే.. అక్షయ్ - సారా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. తన ప్రియుడిని కలిసినా సరే.. ధనుష్ ను వదులుకోవడానికి సారా ఇష్టపడటం లేదు. ఇద్దరితో ప్రేమలో ఉన్న సారా.. ధనుష్ - అక్షయ్ లను కావాలని కోరుకోవడమే ఈ సినిమా. 'అత్రాంగి రే' అంటే అర్థం అసాధారణం. ఇది అసాధారణమైన ప్రేమకథ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

అయితే సారా పరిస్థితిని అక్షయ్ అర్థం చేసుకున్నట్లు కనిపించగా.. విషయం తెలిసి ధనుష్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. వీరి ముగ్గురి లైఫ్ లో చివరికి ఏం జరుగుతుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ధనుష్ ఎప్పటిలాగే సహజమైన ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేశారు. ఇద్దరి వ్యక్తులను ఒకేసారి ప్రేమించి.. ఇద్దరినీ వదుకోలేక తికమకపడే అమ్మాయిగా సారా అలరించింది. అక్షయ్ మ్యుజిషియన్ గా కనిపిస్తున్నా.. సినిమాలో అతని పాత్రలో ఏదో ట్విస్ట్ ఉంటుందని సందేహాలు కలుగుతున్నాయి.

'అత్రాంగి రే' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ హిమాన్షు శర్మ అందించారు. టీ సిరీస్ - కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ - కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. ఆనంద్ ఎల్ రాయ్ - హిమాన్షు శర్మ - భూషణ్ కుమార్ - కిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 24న హాట్ స్టార్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.