Begin typing your search above and press return to search.

పవన్ సార్ ని కలిసే ఛాన్స్ వచ్చినా మాటలు రావేమో!

By:  Tupaki Desk   |   18 Jan 2022 7:47 AM GMT
పవన్ సార్ ని కలిసే ఛాన్స్ వచ్చినా మాటలు రావేమో!
X
ఈ మధ్య కాలంలో బాగా పాప్యులర్ అయిన పాటల్లో 'లాలా భీమ్లా' అనే సాంగ్ ఒకటి. పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'లాలా భీమ్లా' అనే పాటను అరుణ్ కౌండిన్య ఆలపించాడు. ఈ పాటతో ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఇంత రెస్పాన్స్ ను నేను ఊహించలేదు. ప్రమోషన్స్ లో భాగంగా, నేను పాడుతున్న వీడియోను వదులుతారని అస్సలు అనుకోలేదు.

ఇక ఈ పాటకి సంబంధించిన వీడియాను రిలీజ్ చేసిన తరువాత, ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని ఎంతమాత్రం అంచనా వేయలేదు. సింగర్ గా నన్ను నేను నిరూపించుకోవడం కోసం చాలా కాలంగా కష్టపడుతున్నాను. లక్కీగా ఈ పాటతో బ్రేక్ వచ్చింది. పవన్ కల్యాణ్ సినిమా కోసం .. ఆయన పాత్ర కోసం పాడటం, త్రివిక్రమ్ గారు రాసిన లిరిక్స్ ను తమన్ గారి సంగీతంలో పాడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మ్యూజిక్ అనేది మొదటి నుంచి మా ఫ్యామిలీలోనే ఉంది. అందువలన నా చిన్నతనంలోనే నన్ను మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేశారు.

చదువు పూర్తయిన తరువాత పాటలు పాడటంపై గల ఇష్టంతో ఇటు వైపు వచ్చేశాను. 2013లో సినిమా పాటల కోసం మొదటిసారిగా రికార్డింగ్ థియేటర్లోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచి కష్టపడుతూనే ఈ పాట వరకూ వచ్చాను. తమన్ గారి చాలా సినిమాలకు నేను కోరస్ పాడాను. అలాగే 'కేజీఎఫ్'తో పాటు మరికొన్ని సినిమాలకు గ్రూప్ సాంగ్స్ పాడాను. 'భీమ్లా నాయక్' పాట అంతగా పాప్యులర్ కావడానికి ముఖ్యమైన కారణం త్రివిక్రమ్ గారు. చాలా తేలికైన పదాలతో ఆయన ఆ పాట రాశారు. అందువలన ఆ పాటను చిన్న పిల్లలు కూడా పాడుకుంటున్నారు.

ఈ పాటను వింటూ పవన్ గారు చాలా ఎంజాయ్ చేశారనీ .. ఆయనకి బాగా నచ్చిందనీ .. నన్ను మెచ్చుకున్నారని తమన్ గారు నాతో అన్నారు. పవన్ కల్యాణ్ గారిని నేను దగ్గర నుంచి చూశానుగానీ, ఎప్పుడూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆయన పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం వచ్చినా, నాకు మాటలు రావేమో. ఆయన పాటల్లో నాకు 'చెలియా చెలియా చిరుకోపమా' చాలా ఇష్టం. ఆయనకి మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాను. ఏ పాటనైనా ఎంజాయ్ చేస్తూ పాడటం వల్లనే హండ్రెడ్ పెర్సెంట్ అవుట్ పుట్ ఇవ్వగలుగుతాము. అప్పుడే జనం కూడా అందుకు తగినట్టుగా రెస్పాన్స్ ను ఇస్తారు. వర్క్ పరంగా .. ఆర్ధికంగా నేను ఎప్పుడూ కూడా కష్టాలు పడింది లేదు. తెర వెనుక నేను అనుకున్న మార్గంలో ముందుకు వెళుతూనే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.