#ధాకడ్.. రాంపాల్ లుక్ రంపంలా కోస్తోంది

Sat Jun 19 2021 09:00:02 GMT+0530 (IST)

Arjun Rampal Blonde Look Left Netizens Shocked

కంగన రనౌత్ మరోసారి యాక్షన్ క్వీన్ అవతారమెత్తి రణభూమిలో గర్జిస్తున్న సంగతి తెలిసిందే. వార్ జోన్ లో మెషీన్ గన్ తో వారియర్ లా చెలరేగుతున్న ఫోటోలు మోషన్ టీజర్లు వెబ్ ని అట్టుడికించాయి. `మణికర్ణిక` క్వీన్ ఆఫ్ ఝాన్సీ పాత్రలో విరోచిత పోరాటాలతో ఆకట్టుకున్న కంగన ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఆర్మీ ఉమెన్ గా అల్లాడించబోతోందన్నది అభిమానుల కంటికి కునుకుపట్టనివ్వడం లేదు.మరోవైపు కంగనకు ధీటైన విలన్ కావాలి కదా? అందుకే యాక్షన్ ప్యాక్డ్ బాడీకి మారు రూపంగా కనిపించే అర్జున్ రాంపాల్ ని చిత్రబృందం బరిలో దించింది. 48 ఏళ్ల రాంపాల్ ధాకాడ్ లో ఆసక్తికరమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో అర్జున్ రాంపాల్ రుద్రవీర్ అనే ప్రతినాయకుడిగా నటించారు. ఫిబ్రవరి షెడ్యూల్ లో అర్జున్ రాంపాల్ పాల్గొన్న సీన్స్ తీసారు. లాక్ డౌన్ తర్వాత తదుపరి షెడ్యూల్ కి అతడు సన్నద్ధమవుతున్నాడు. ఈసారి అతను లుక్ మార్పుతో ప్రిపరేషన్ ప్రారంభించాడు.

శుక్రవారం అర్జున్ రాంపాల్ తన కొత్త రూపాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అతడు నయా ట్రెండీ లుక్ తో అభిమానులకు షాకిచ్చారు. బూడిదరంగు జుట్టును స్పైక్ లతో అదరగొట్టాడు. వైట్ స్పైక్స్ కి ఆపోజిట్ గా అతని నల్ల గడ్డం ఆకట్టుకుంది. అర్జున్ రాంపాల్ తన లుక్ కోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అమీర్ హకీమ్ ని బరిలో దించారట. సవాల్ అనిపించే లుక్ ని సృష్టించడానికి నాకు సహాయం చేసినందుకు నా సోదరుడు ఆలీమ్ హకీమ్ కు.. నా కలను సాకారం చేసిన రజ్నీష్ రజి ఘైకి ధన్యవాదాలు అని తెలిపాడు. రాంపాల్ లుక్ రంపంలా కోస్తోంది అంటూ అప్పుడే అభిమానుల నుంచి స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

జనవరిలోనే అర్జున్ రాంపాల్ తన పాత్ర మొదటి లుక్ ని పరిచయం చేశాడు. చెడుకి కొత్త పేరు ఉంది - రుద్రవీర్! ప్రమాదకరమైన.. ఘోరమైన విలన్.. అంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధాకడ్ బృందం మధ్యప్రదేశ్ లో షూటింగ్ చేసింది. ఫిబ్రవరిలో షెడ్యూల్ పూర్తయింది. నిజానికి దీపావళి 2020 విడుదలకు ప్లాన్ చేసినా  కారణంగా ఆలస్యం అయింది. ధాకాడ్ ఇప్పుడు అక్టోబర్ 1 న సినిమాహాళ్లలో విడుదల కానుంది.