చిరంజీవి - మహేష్ ఇద్దరూ సేమ్ కాన్సెప్ట్ తో వస్తున్నారా...?

Tue Jul 07 2020 12:40:58 GMT+0530 (IST)

Are The Stories Of 'Acharya' And 'Sarkaru Vaari Paata' Same?

టాలీవుడ్ లో ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ మూవీస్ లలో 'ఆచార్య' మరియు 'సర్కారు వారి పాట' సినిమాల విషయంలో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాని కొణెదల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకున్న 'ఆచార్య' కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా రానున్న 'సర్కారు వారి పాట' సినిమాకి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.కాగా ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే స్టోరీ లైన్ మీద రూపొందనున్నాయనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. కొరటాల శివ సినిమా అంటేనే సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి తీస్తాడనే పేరుంది. ఈ క్రమంలో చిరంజీవితో తీస్తున్న 'ఆచార్య' సినిమా కూడా దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలు.. ప్రభుత్వ భూముల కబ్జాలు.. తదితర అంశాలతో సందేశాత్మకంగా ఉండబోతోందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మహేష్ బాబు కూడా ఇటీవల తన సినిమాల ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా చూసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' సినిమా కూడా సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని ఇప్పటికే మహేష్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా నేపథ్యం కూడా ప్రభుత్వ భూముల కబ్జాలు.. ప్రభుత్వ స్కాములు.. తదితర అంశాల నేపథ్యంలోనే ఉండబోతోందని సమాచారం.

మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు సినిమాలు స్టోరీ లైన్ ఒకేలా ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఒకే స్టోరీ లైన్ తో సినిమాలు రావడం సహజమే అయినప్పటికీ ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు రావడం అరుదుగా జరిగే విషయం. గతంలో ఇలా ఒకే నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. వాటితో కొందరు హిట్స్ అందుకోగా మరికొందరు పరాజయాన్ని చవి చూసారు. మరి ఇప్పుడు మెగాస్టార్ - సూపర్ స్టార్ లు 'ఆచార్య' - 'సర్కారు వారి పాట' సినిమాలతో విజయాలను అందుకుంటారేమో చూడాలి. ఇక ఈ రెండు సినిమాలపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.