18 పేజెస్ చదవబోతున్న ప్రేమమ్ బ్యూటీ

Sun Aug 09 2020 23:00:01 GMT+0530 (IST)

Anupama Parameshwaran To Romance with Nikhil for 18 Pages Movie

అయిదు సంవత్సరాల క్రితం మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో నటించి సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల అందరిని ఆకర్షించిన మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు తెలుగులో అ ఆ మరియు ప్రేమమ్ రీమేక్ చిత్రాలతో పరిచయం అయ్యింది. మంచి స్టార్టింగ్ దక్కినా కూడా ఏదో కారణాల వల్ల ఈ అమ్మడికి స్టార్ ఇమేజ్ రావడం లేదు. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా నటిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న ఈ ప్రేమమ్ బ్యూటీకి నిఖిల్ హీరోగా నటించబోతున్న ‘18 పేజెస్’ అనే చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు మరియు సుకుమార్ లు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ చిత్ర దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నాడు. మొదటి సినిమాలో హెబ్బా పటేల్ ను విభిన్నంగా చూపించి అందరి ప్రశంసలు దక్కించుకున్న సూర్య ప్రతాప్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ కు ప్రాముఖ్యత ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచి పోయింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. సక్సెస్ లేక మూసగా ముందుకు వెళ్తున్న అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంతో అయినా సక్సెస్ దక్కించుకుంటుందా చూడాలి.