సినీపరిశ్రమను వరుస విషాదాలు పట్టి కుదిపేస్తున్నాయి. నాలుగు నెలల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం విషాదం నింపింది. అంతలోనే నెల రోజుల గ్యాప్ తో సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త ఘట్టమనేని అభిమానులు సహా తెలుగు అభిమానుల హృదయాలను కలచివేసింది. దశాబ్ధాల పాటు పరిశ్రమ తలలో నాలుకలా వ్యవహరించి... దర్శకసంఘం అధ్యక్షుడిగా కొనసాగిన సీనియర్ దర్శకుడు సాగర్ మృతి బాధ పెట్టింది. మొన్నటికి మొన్న కళాతపస్వి కె.విశ్వనాథ్ శివైక్యం ఇవన్నీ అభిమానులను తీవ్రంగా కలచివేసాయి. కె.విశ్వనాథ్ మృతితో ఒక శకం ముగిసింది! అంటూ కళారంగం చిన్నబోయింది.
ఇంతలోనే మరో ఇరువురు దిగ్గజాల మరణవార్తలను వినాల్సొచ్చింది. ప్రముఖ గాయని వాణీ జైరామ్ ఫిబ్రవరి 4 న చెన్నైలోని తన నివాసంలో మరణించారు. తమిళనాడు పోలీసులు ఆమె మరణాన్ని ధృవీకరించారు.
నగరంలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో వాణి ఒంటరిగా నివాసం ఉంటున్నారు. 2023 జనవరి 25న వాణీ జైరామ్ కళా రంగానికి చేసిన కృషికి పద్మభూషణ్ తో సత్కరించారు. ఆమె కిందపడిపోయి నుదిటిపై గాయపడినట్లు సమాచారం. అయితే ఆమె హఠాన్మరణానికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది.
ప్రముఖ నిర్మాత మృతి:
ఓవైపు దిగ్గజ గాయని వాణీ జైరామ్ చెన్నైలో మృతి చెందారన్న వార్త దావానలంలా చుట్టేయగా.. అంతకు కొన్ని గంటల ముందు ప్రముఖ సీనియర్ నిర్మాత ఆర్.వి.గురుపాదం బెంగళూరులో మృతి చెందారని తెలిసింది. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన బెంగళూరు నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 54.
2022 చివరి క్వార్టర్ లో ఇరువురు దిగ్గజాలు మృతి చెందగా.. అలాగే 2023 ఆరంభం అశుభ వార్తలు వినాల్సి వచ్చింది. తెలుగుచిత్ర సీమతో గొప్ప అనుబంధం ఉన్న ప్రముఖులను వరుసగా కోల్పోవాల్సి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.