ఈ మధ్య కాలంలో సౌత్ లో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. గత ఏడాది అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమాను రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో జక్కన్న తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మాత్రమే కాకుండా తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య లో నటించాడు. వరుసగా రెండు మల్టీ స్టారర్ సినిమాలు చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలకు ముందే బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ వద్దకు మరో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమా తో డీసెంట్ సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు హను రాఘవపూడి తదుపరి సినిమా ను సూర్య తో చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సూర్య కు హను రాఘవపూడి కథ కూడా చెప్పాడు అంటూ సమాచారం అందుతోంది.
సూర్య కు హను రాఘవపూడి చెప్పిన కథలో హీరో పాత్రతో పాటు మరో కీలక పాత్ర ఉందట. ఆ పాత్రకు రామ్ చరణ్ అయితే బాగుంటాడు.. ఆ పాత్రను రామ్ చరణ్ తో చేయించమని దర్శకుడికి సూర్య సలహా ఇచ్చాడట. సూర్య సూచన మేరకు రామ్ చరణ్ కు అదే కథను చెప్పేందుకు గాను హను రాఘవపూడి రెడీ అవుతున్నాడు అంటున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గతంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.
కనీసం ఇప్పుడు అయినా సూర్యతో కలిసి హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తాడా అనేది చూడాలి. రామ్ చరణ్ వరుసగా మల్టీ స్టారర్ లు చేస్తుండటం పట్ల మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.