Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' సినిమాటోగ్రాఫర్ కి మరో క్రేజీ ఆఫర్..!

By:  Tupaki Desk   |   25 Nov 2020 5:00 AM GMT
రాధే శ్యామ్ సినిమాటోగ్రాఫర్ కి మరో క్రేజీ ఆఫర్..!
X
ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఏమాయ చేశావే' 'కిక్ 2' 'రేసుగుర్రం' 'బ్రూస్ లీ' 'జాగ్వార్' 'తూటా' 'ధ్రువ నక్షత్రం' వంటి సినిమాలకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' కి మనోజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీలో విజువల్స్ ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఇటీవలే విడుదలైన 'రాధే శ్యామ్' టీజర్ చూస్తూనే మనోజ్ పరమహంస కెమెరా పనితనం అర్థం అవుతోంది. ప్రతి షాట్ కూడా ఒక పెయింటింగ్ తరహాలో చూపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మనోజ్ మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్' సినిమాని విడుదలకు సిద్ధం చేశాడు. దీని తర్వాత తన కెరీర్లో 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ముందుగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అనుకున్నప్పటికీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నెల్సన్ దిలీప్ చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న 'విజయ్65' చిత్రానికి మనోజ్ పరమహంస ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారని సమాచారం. మనోజ్ ఇంతకముందు విజయ్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'నన్బన్' (స్నేహితుడు) చిత్రానికి డీవోపీగా వర్క్ చేశాడు. మనోజ్ కెమెరా పనితనం తెలిసిన విజయ్ ఇంకోసారి తన సినిమాకి రిఫర్ చేసాడట. 'మాస్టర్' సినిమా విడుదలయ్యాక 'విజయ్65' షూటింగ్ ప్రారంభం కానుంది.