Begin typing your search above and press return to search.

RRR సినిమా పై హైకోర్టులో మరో కేసు..!

By:  Tupaki Desk   |   18 Jan 2022 7:54 AM GMT
RRR సినిమా పై హైకోర్టులో మరో కేసు..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు RRR సినిమాపై నమోదవుతున్న వరుస కోర్టు కేసులు మేకర్స్ కు తలనొప్పిగా మారుతున్నాయి.

1920నాటి విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్‌ ల పాత్రలతో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రాజమౌళి రూపొందించారు. చరిత్రలో కలిసారో లేదో తెలియని ఈ ఇద్దరు వీరుల మధ్య స్నేహాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ద్వారా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి.

తాజాగా RRR సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తున్నారని పేర్కొంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆరోపిస్తూ.. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్ పోలీసుగా చూపడం దారుణమని పేర్కోన్నారు.

ఈ విషయమై RRR మేకర్స్ పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అల్లూరి యువజన సంఘం సభ్యులు వివరించారు. అల్లూరి - కొమురం భీమ్ లు కలిసినట్టు చరిత్రలో లేదని.. ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

ఇకపోతే ఇంతకముందు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు - కొమరం భీం చరిత్రలను వక్రీకరించారని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని పిటీషనర్ కోరారు. అలాగే సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఈ క్రమంలో ఇప్పుడు RRR చిత్రంపై తాజాగా మరో పిల్ దాఖలైంది. మరి ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే లోపు ఇంకెన్ని కోర్టు వివాదాలు వస్తాయో చూడాలి. కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇందులో అలియా భట్ - అజయ్ దేవగణ్ - ఒలివియా మోరీస్ - సముద్ర ఖని కీలక పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.