'ఇష్క్' సినిమా విడుదల వాయిదా..!

Tue Apr 20 2021 20:53:21 GMT+0530 (IST)

Another Tollywood film postpones its release with Covid19 scare

యువ హీరో తేజా సజ్జా - ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇష్క్''. ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. రాజు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్టు వారం క్రితం ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా.. తాజాగా 'ఇష్క్' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి 'ఇష్క్' చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని మేకర్స్ తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పెట్టడం.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 21 నుండి థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించడం.. ఆంధ్రప్రదేశ్ లో 50% ఆక్యుపెన్సీ వంటివి సినిమా వాయిదా వేయడానికి ఇతర కారణాలని తెలుస్తోంది. కాగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే 'లవ్ స్టోరీ' 'తలైవి' 'టక్ జగదీష్' 'విరాటపర్వం' వంటి చిత్రాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.