ఇంకో తెలుగమ్మాయి.. తమిళంలో సెటిలైపోయినట్లే

Sun Oct 18 2020 13:20:56 GMT+0530 (IST)

Another Telugu Heroine Settled In Tamil

అదేంటో తెలుగు హీరోయిన్లకు తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు అవకాశాలు అందవు. కానీ మన అమ్మాయిల్ని వేరే భాషల వాళ్లు నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమిళంలో తెలుగు హీరోయిన్లకు భలే డిమాండ్ కనిపిస్తుంటుంది. ఇక్కడ పెద్దగా పేరు తెచ్చుకోని మన అమ్మాయి కోలీవుడ్‌కు వెళ్లి స్టార్లయిపోతుంటారు. అంజలి స్వాతి ఆనంది శ్రీ దివ్య.. ఇలా గతంలో చాలామంది తెలుగు హీరోయిన్లు తమిళంలో బాగా క్లిక్ అయ్యారు. ఈ కోవలోకే చేరేలా కనిపిస్తోంది రీతూ వర్మ. తెలుగులో ముందు సహాయ పాత్రలు పోషించి ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’తో కథానాయికగా మంచి బ్రేక్ అందుకుంది రీతూ. ఆ తర్వాత ఆమె ‘కేశవ’లో కథానాయికగా నటించింది. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం నాని సరసన ‘టక్ జగదీష్’లో ఆమెకు ఛాన్సొచ్చింది.ఐతే ఈ లోపు తమిళంలో రీతూకు మంచి పేరొచ్చేసింది. ఆల్రెడీ ఆమె విక్రమ్ లాంటి పెద్ద హీరో సరసన ‘ధృవనక్షత్రం’లో నటిస్తోంది. గౌతమ్ మీనన్ లాంటి పెద్ద దర్శకుడు పిలిచి అవకాశం ఇవ్వడమంటే మాటలు కాదు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమైంది. ఐతే దుల్కర్ సల్మాన్ సరసన రీతూ చేసిన ‘కనులు కనులను దోచాయంటే’ తమిళంలో సూపర్ హిట్టయింది. ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. కాగా ఇప్పుడు రీతూ అమేజాన్ ప్రైమ్ కోసం తెరకెక్కిన ఆంథాలజీ వెబ్ సిరీస్ ‘పుతం పుదు కాలై’లో ఒక ఎపిసోడ్‌లో కీలక పాత్ర చేసింది. దాని పేరు.. ‘అవరుం నానుమ్’. ఒక వృద్ధుడికి ఆయన మనవరాలికి మధ్య నడిచే కథ ఇది. కరోనా వాళ్ల మధ్య ఎలా అంతరాన్ని తగ్గించి దగ్గర చేసిందన్న నేపథ్యంలో గౌతమ్ మీనన్ ఈ కథను తెరకెక్కించాడు. మొత్తం ఐదు కథల్లో దీనికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రీతూ మీద అన్ని వైపులా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె అందం అభినయాన్ని తెగ పొగిడేస్తున్నారు తమిళులు. చూస్తుంటే రీతూ అక్కడ స్టార్ అయిపోయినట్లే కనిపిస్తోంది.