ఏపీ.. టాలీవుడ్ నటులకు ఇంకా పదవులు దక్కేనా?

Fri Jan 27 2023 10:00:00 GMT+0530 (India Standard Time)

AndhraPradesh Can Tollywood actors still get positions?

ఏపీలో 2019 ఎన్నికల సందర్భంగా పలువురు టాలీవుడ్ నటులు వివిధ విభాగాలవారు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో కొంతమంది స్వయంగా వైసీపీలో చేరారు కూడా. ముఖ్యంగా మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు విష్ణు వినాయకుడు భానుచందర్ అలీ పోసాని కృష్ణమురళి చిన్నికృష్ణ యాంకర్ శ్యామల ఆమె భర్త నరసింహ రాజశేఖర్ జీవిత హాస్య నటుడు పృథ్వీ విజయచందర్ తదితరులు వైసీపీకి అనుకూలంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారం చేశారు.



అయితే వైసీపీ గెలుపొందాక ఒక్క పృథ్వీకి మాత్రమే పదవి దక్కింది. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ గా ఆయనను నియమించారు. అయితే అనూహ్యంగా మహిళతో అసభ్యంగా ఫోన్ లో మాట్లాడరనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగించారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఆయనే తప్పుకున్నారు.

ఇక మోహన్ బాబు తనకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించారంటారు. అయితే ఆయనకు ఏమీ దక్కలేదు. భానుచందర్ చిన్నికృష్ణ తదితరుల పరిస్థితి అంతే. అలీ పోసానిలకు కూడా జగన్ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత కానీ పదవులు దక్కలేదు. అది కూడా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని.. వారితో మళ్లీ పని పడుతుందనే పదవులిచ్చారని గాసిప్స్ వినిపించాయి.

అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పోసాని కృష్ణమురళికి ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా అవకాశమిచ్చారు. ఇక జీవిత రాజశేఖర్ చిన్నికృష్ణ కృష్ణుడు భానుచందర్ శ్యామల తదితరులకు రిక్తహస్తమే ఎదురైంది.

ఈ నేపథ్యంలో వచ్చే మార్చిలో ఏపీ శానసమండలిలో దాదాపు 12 స్థానాలు ఖాళీ అవుతాయని అంటున్నారు. వీటిపై వైసీపీలో పెద్ద ఎత్తున ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను చేస్తానంటూ స్వయంగా కొందరికి హామీలిచ్చారు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వంటివారు ఈ జాబితాలో ఉన్నారు.

మరోవైపు ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో పవన్ కల్యాణ్ ను విమర్శలు చేయడానికి సినీ రంగానికి చెందినవారు అవసరమవుతారని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తారని టాక్ నడుస్తోంది. ఈ వరుసలో మంచు మోహన్ బాబు భానుచందర్ విజయ్ చందర్ వంటివారు ఉన్నారని చెబుతున్నారు. మరి వైఎస్ జగన్ మదిలో ఏముందో త్వరలోనే తేలనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.