Begin typing your search above and press return to search.

సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును వెంట‌నే రద్దు చేయాలి!- కమల్

By:  Tupaki Desk   |   29 July 2021 10:01 AM GMT
సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును వెంట‌నే రద్దు చేయాలి!- కమల్
X
విశ్వ‌నటుడు.. ద‌ర్శ‌క‌నిర్మాత కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా కమల్ స‌హా వందలాది మంది ప్రముఖ భారతీయ తార‌లు.. ద‌ర్శ‌క‌నిర్మాతలు.. సాంకేతిక నిపుణులు చేరారు.

నిన్న రాత్రి కమల్ హాస‌న్ త‌న‌ ట్విట్టర్ లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో తన ప్రసంగం నుండి రెండు ఫోటోలను ట్వీట్ చేశారు. కొత్తగా ప్రతిపాదించిన బిల్లు ప్రమాదకరమని.. భావ ప్రకటనా స్వేచ్ఛకు గొంతు కోసి చంపేస్తుందని కమల్ అన్నారు. ఈ బిల్లును ఫెడరల్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అని కమల్ ట్వీట్ చేశారు. సి.బి.ఎఫ్‌.సి స్వయంప్రతిపత్తిని తీసివేసి.. బిల్లు ప్రధానంగా సినిమా సంబంధ‌ ధృవపత్రాలపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తుంది. దీనివ‌ల్ల సినిమా రాజకీయాల్లో న‌లిగిపోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

స‌వ‌ర‌ణ బిల్లుతో ముప్పు ఇదీ

ప్రాంతీయ సినిమా సృజ‌నాత్మ‌క‌త‌ను తొక్కేయ‌డానికి లేదా స్వేచ్ఛ‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్రానికి ప‌గ్గాలు ఇచ్చేస్తే ఆపై ఏం జ‌రుగుతుందో ఊహించేదే.. ఆటోమెటిగ్గా సెన్సార్ షిప్ విలువ ప‌డిపోతుంది. సెన్సార్ బృందాన్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇన్నాళ్లు సెన్సార్ ప‌రిధిలో చిన్నా చిత‌కా స‌మ‌స్య‌లు ఉన్నా కానీ ప‌రిష్కారం అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లుతో ఇక ఏదీ ప్రాంతీయంగా చేతిలో ఉండ‌దు. అంతా కేంద్రం చూసుకుంటుంది. అక్కడివ‌ర‌కూ వెళ్లి మ‌న సినిమాల‌న్నీ ఫైన‌ల్ గా సెన్సార్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే కేంద్రం పెత్త‌నం రాజ‌కీయాలు కూడా ఇందులో ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. అందుకే సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తున్నారు.

అమీర్ ఖాన్- క‌మ‌ల్ హాస‌న్- సూర్య‌- విశాల్ వంటి స్టార్ల‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ బిల్లును వ్య‌తిరేకించారు. తెలుగు సినీప‌రిశ్ర‌మ నుంచి సుధీర్ బాబు బిల్ల‌ను విమ‌ర్శించారు. మ‌రికొంద‌రు రాజ‌కీయాలతో ముడిప‌డిన అంశం కాబ‌ట్టి అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఇక‌పోతే మ‌న స్టార్లు వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నారు కాబ‌ట్టి రాజ‌కీయంగా త‌మ చిత్రాల రిలీజ్ లు సాఫీగా సాగాలంటే కేంద్రానికి వ‌త్తాసు ప‌లుకుతున్నార‌నే అభిప్రాయం నెల‌కొంది.

భ‌విష్య‌త్ లో సృజ‌నాత్మ‌క‌త‌కు పెను విఘాతం క‌ల‌గ‌నుంది. ప్ర‌మాదం పొంచి ఉంది. అస‌లు సినిమా ఇండ‌స్ట్రీపై దాడుల్ని ఎవ‌రూ స‌హించ‌కూడ‌దు. కానీ మౌనంగానే భ‌రిస్తున్నారు. ఇంత‌కుముందు సెన్సార్ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం అయిన‌ప్పుడు కూడా ఎవ‌రూ పెద‌వి విప్ప‌లేదు. అది చాలా స‌మ‌స్య‌ల్ని సృష్టించింది. ఇప్పుడు సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా ఆశించినంత‌గా ఎదురు తిర‌గ‌లేద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఎంవోయూ పై కొంద‌రు స్టార్లు వినోద రంగం నుంచి సంత‌కాలు చేశారు మిన‌హా చేసిందేమీ లేదు.

అయితే స్వేచ్ఛ‌కు సంకెళ్లు వేసే ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను క‌లిసిక‌ట్టుగా వ్య‌తిరేకించ‌క‌పోతే ఒకే వేదిక‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌గ‌ళం వినిపించ‌క‌పోతే అది చాలా ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌న్నది నిజం. ఇక‌పోతే తెలుగు సినిమా రంగం ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతోంది. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంతో మ‌రిన్ని చిక్కుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మూవీ ఆర్టిస్టుల ఎన్నిక‌ల గురించి ఆలోచించిన‌ట్టే.. సినీపెద్ద‌లు సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లుపైనా చ‌ర్చిస్తారేమో చూడాలి.