Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కుడి ఎడమైతే (వెబ్ సిరీస్)

By:  Tupaki Desk   |   16 July 2021 8:09 AM GMT
మూవీ రివ్యూ : కుడి ఎడమైతే (వెబ్ సిరీస్)
X
చిత్రం : ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్

నటీనటులు: అమలా పాల్-రాహుల్ విజయ్-రవిప్రకాష్-రాజ్ ముదిరాజ్ తదితరులు
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
రచన: రామ్ విఘ్నేష్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: పవన్ కుమార్

వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో మిగతా భాషలతో పోలిస్తే తెలుగుది వెనుకబాటే. ఇక్కడ తెరకెక్కిన ఒరిజినల్స్ చాలా తక్కువ. అందులోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నవి మరీ అరుదు. ఐతే తెలుగువారి ఓటీటీ ‘ఆహా’ మంచి కాస్ట్ అండ్ క్రూతో, ప్రొడక్షన్ వాల్యూస్‌ తో వెబ్ సిరీస్‌ లు నిర్మిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ కోవలో వచ్చిన కొత్త సిరీస్ ‘కుడి ఎడమైతే’. లూసియా, యు టర్న్‌ లాంటి చిత్రాలతో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు పవన్ కుమార్ ఈ సిరీస్ ను రూపొందించడం విశేషం. అమలా పాల్.. రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే ఒక కాంప్లికేటెడ్ థ్రిల్లర్ ను పవన్ డీల్ చేసినట్లు కనిపించింది. మరి ఈ థ్రిల్లర్ ఏ మేర అంచనాలను అందుకుందో చూద్దాం పదండి.

ముందుగా కథ విషయానికి వస్తే.. ఆది (రాహుల్ విజయ్) హైదరాబాద్ సిటీలో ఒక డెలివరీ బాయ్. దుర్గ (అమలా పాల్) ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో పని చేసే సీఐ. వీళ్లిద్దరి జీవితాల్లో ఒక రోజు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ రోజు చివరికి వాళ్లిద్దరూ యాక్సిడెంట్లో చనిపోతారు. ఐతే మరుసటి రోజు చూస్తే.. యధావిధిగా వాళ్ల డే స్టార్ట్ అవుతుంది. కానీ ముందు రోజు జరిగినవన్నీ అలాగే జరుగుతుంటాయి. అంటే వీళ్ల రోజు మారదు. ముందు రోజులోనే ఉండిపోతారు. ఆ ముందు రోజు వీళ్లిద్దరూ చనిపోవడానికి ముందు.. కిడ్నాప్ అయిన ఒక పిల్లాడు.. మరో అమ్మాయి.. అలాగే ఆది స్నేహితుడు ప్రాణాలు కోల్పోతారు. దీంతో మళ్లీ రోజు కొత్తగా మొదలైన నేపథ్యంలో ఆ దారుణాలు జరగకుండా ఆపడానికి ఆది.. దుర్గ ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వీళ్లెంత వరకు విజయవంతం అయ్యారు.. వీళ్లిద్దరికీ ఇలా ఎందుకు జరుగుతోంది.. వారి మధ్య కనెక్షన్ ఏంటి అనే విషయాలు పూర్తి సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

పైన కథ గురించి చదువుతున్నపుడే కొంచెం గందరగోళంగా.. అలాగే ఇల్లాజికల్ గా అనిపించి ఉండొచ్చు. ఐతే పవన్ కుమార్ తీసిన లూసియా.. యు టర్న్ సినిమాలు కూడా అంతే. ప్రేక్షకుల ఊహకు అందని కాన్సెప్ట్స్ తీసుకుని కొంచెం టిపికల్ గా డీల్ చేయడం అతడి శైలి. తాను తీసిన తొలి వెబ్ సిరీస్ విషయంలో కూడా పవన్ అదే శైలిని అనుసరించాడు. టైం లూప్ నేపథ్యంలో అతను రూపొందించిన ‘కుడి ఎడమైతే’ సిరీస్.. ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తూనే.. వారికి కొత్త అనుభూతిని కూడా పంచుతుంది.

ఇదొక ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాతో తెరకెక్కిన సిరీస్ కాబట్టి ముందుగా లాజిక్స్ పక్కన పెట్టేసి చూడాలి. చాలా కొత్తగా అనిపించే పాయింట్ ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. మధ్యలో కొంచెం బోర్ కూడా కొట్టొచ్చు. కానీ అసలేం జరిగింది.. ఏం జరగబోతోందనే ఆసక్తిని రేకెత్తిస్తూ.. చివరి వరకు ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంంచడంలో.. థ్రిల్ చేయడంలో ‘కుడి ఎడమైతే’ విజయవంతం అయింది.

‘కుడి ఎడమైతే’ ఆరంభం చాలా మామూలుగా అనిపిస్తుంది. ఓవైపు ఆది.. మరోవైపు దుర్గల వర్కింగ్ డేను చూపిస్తూ చాలా మామూలుగానే కథను నడిపించాడు దర్శకుడు. ఐతే ఒక రోజు పూర్తయ్యాక వీళ్లిద్దరూ తిరిగి అదే రోజులోకి వచ్చి అన్ని సంఘటనలూ రిపీట్ కావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి ఇదేదో వైరైటీగా ఉందే అనుకుంటూ ప్రేక్షకులు ఈ సిరీస్ లో ఇన్వాల్వ్ అవుతారు. మల్టిపుల్ లేయర్స్ ఉన్న కథను కొంచెం గందరగోళంగా డీల్ చేసినప్పటికీ.. సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో మాత్రం దర్శకుడు విజయవంతం అయ్యాడు.

ఈ కాన్సెప్ట్‌ తో సినిమా అయితే కొంచెం వేగంగా లాగించడానికి చూసేవారేమో. ఎడిటర్ కత్తెరకు పని పెట్టేవాడేమో. కానీ వెబ్ సిరీస్ కావడంతో కావాల్సినంత టైం తీసుకున్నారు. టైం లూప్ అనే కాన్సెప్ట్ కు డీటైలింగ్ ఇచ్చే క్రమంలో అవే సీన్లు మళ్లీ మళ్లీ చూపించడంతో ప్రేక్షకుల్లో అసహనం కలుగుతుంది. మధ్యలో ఈ సిరీస్ ఎటు పోతోందో అర్థం కాని పరిస్థితి కూడా తలెత్తుతుంది. మధ్యలో వచ్చే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకుల సహనానికి కొంత పరీక్ష పెడతాయి.

ఐతే ఆది.. దుర్గ ఎవరికి వారుగా తమ జీవితంలో ఏం జరుగుతోందో తెలియక గందరగోళానికి గురయ్యే వరకు మామూలుగా నడిచే కథనం.. వాళ్లిద్దరూ కలిసి తమ ఇద్దరికీ ఒకే రకమైన అనుభవం ఎదురైందని గుర్తించి ఒకరికొకరు సాయం చేసుకుంటూ రహస్యాలను ఛేదించేందుకు .. అలాగే ముందు రోజు జరిగిన దారుణాలను ఆపేందుకు ప్రయత్నించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. చివరి మూడు ఎపిసోడ్లలో కథనం మంచి ఊపుతో సాగుతుంది. చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోతాయి. చివరి ఎపిసోడ్లో ప్రేక్షకులు బాగానే థ్రిల్ అవుతారు.

ముఖ్యంగా డైరెక్టర్ పవన్ పోషించిన పాత్ర ముగింపు ఆసక్తికరంగా ఉండటానికి తోడ్పడింది. కిడ్నాప్ రాకెట్ ను ఛేదించే ఎపిసోడ్ కూడా ఓకే. మొత్తంగా చూస్తే ఆరంభంలో ఆసక్తి రేకెత్తించి.. మధ్యలో కొంత అసహనం రేకెత్తించినప్పటికీ చివరికొచ్చేసరికి ‘కుడి ఎడమైతే’ మంచి ఇంప్రెషన్ కలిగిస్తుంది. మధ్యలో వచ్చే రిపిటీటివ్ సీన్లు కథకు అవసరమే అనిపించినప్పటికీ చూసిన సీన్లే మళ్లీ చూడటం ప్రేక్షకులకు అసహనం కలిగించేదే. దీన్ని ఇంకొంచెం షార్ప్‌ గా ఉండేలా డీల్ చేయాల్సింది. అయినప్పటికీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు.. కాన్సెప్ట్ తో బాగానే కనెక్టయి రచయిత.. దర్శకుల ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

లీడ్ ఆర్టిస్టులు అమలా పాల్.. రాహుల్ విజయ్ ఇద్దరూ కూడా బాగా చేశారు. అమలను ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా అనిపిస్తుంది. రాహుల్ కు అనుభవం తక్కువే అయినప్పటికీ తన పాత్రలో బాగా ఒదిగిపోయాడు. నేపథ్య సంగీతం.. ఛాయాగ్రహణం.. ఇతర సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కొన్ని లోపాలున్నప్పటికీ ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన వెబ్ సిరీసుల్లో కాన్సెప్ట్.. కంటెంట్ పరంగా ‘కుడి ఎడమైతే’ ది బెస్ట్ అనడంలో సందేహం లేదు. చివర్లో అమల పాత్రకు సంబంధించి ఒక ట్విస్ట్ ఇచ్చి రెండో సీజన్ దిశగా సంకేతాలు కూడా ఇవ్వడం విశేషం. సీజన్-2 తీసే దిశగా ‘కుడి ఎడమైతే’కు తెలుగు ప్రేక్షకులకు మంచి ప్రోత్సాహమే అందించే అవకాశముంది.

చివరగా: కుడి ఎడమైతే.. థ్రిల్లింగ్ రైడ్

రేటింగ్-2.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Ott