Begin typing your search above and press return to search.

పుష్ప.. పుష్పరాజ్.. ఎక్కడా తగ్గేదే లే..!

By:  Tupaki Desk   |   8 Dec 2021 9:30 AM GMT
పుష్ప.. పుష్పరాజ్.. ఎక్కడా తగ్గేదే లే..!
X
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ''పుష్ప: ది రైజ్''. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ లేటెస్టుగా రిలీజ్ చేసిన ట్రైలర్ అనూహ్య స్పందన తెచ్చుకుంటోంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో వచ్చిన ఈ ట్రైలర్ రికార్డ్ స్థాయిలో మిలియన్ల కొలదీ వ్యూస్ రాబడుతోంది.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో స్మగ్లర్ పుష్పరాజ్ గా ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు స్టైలిష్ పాత్రలతో అలరించిన బన్నీ.. మొదటిసారిగా కంప్లీట్ మాస్ అవతార్ లో కనిపించాడు. దీనికి తగ్గట్లుగానే చూసిన వెంటనే మొరటోడు అనుకునే హెయిర్ స్టైల్ - గుబురు గడ్డంతో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి 'డర్టీ' లుక్ లోకి మారిపోయాడు. అలానే సినిమా అంతటా ఒక భుజాన్ని పైకి లేపి కనిపించాడు.

అంతేకాదు 'పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే' అంటూ అల్లు అర్జున్ చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. థియేటర్లలో విజిల్స్ వేయించబోతున్నారని ట్రైలర్ తో హామీ ఇచ్చారు. బన్నీ ఇంతకు ముందు మాస్ పాత్రలు పోషించినప్పటికీ.. ఇలాంటి రా అండ్ రస్టిక్ రోల్ చేయలేదనే చెప్పాలి. అందుకే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే 'పుష్ప' సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ట్రైలర్ లో చూడొచ్చు. లారీలు - బైక్ లతో ఛేజింగులు వంటి ఫ్యాన్స్ ని మాంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ కంపోజ్ చేసిన 'దాక్కో దాక్కో మేక' 'శ్రీవల్లి' 'సామి సామీ' 'ఏయ్ బిడ్డా' వంటి నాలుగు పాటలూ మాస్ ఆడియన్స్ కి ఎక్కేసాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ మూడ్ లోకి తీసుకెళ్లబోతోందని అర్థం అయింది.

ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా కూడా డీ గ్లామర్ లుక్ లో ఆకట్టుకుంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ - అజయ్ - అజయ్ ఘోష్ - ధనుంజయ - రావు రమేష్ - శత్రు తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సమంత రూత్ ప్రభు ఈ సినిమా కోసం మాస్ ఐటమ్ నంబర్ లో ఆడిపాడనుంది. థియేటర్లలో మాస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేయడానికి సినీ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలను 'పుష్ప: ది రైజ్' లో చూపించబోతున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అల వైకుంఠపురములో' తో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతారని అభిమానులు ధీమాగా ఉన్నారు. సుక్కూ - బన్నీ కాంబోలో హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అని అంటున్నారు. మరి స్టైలిష్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ మాస్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.