బాలకృష్ణగారిలో నాకు నచ్చే క్వాలిటీ అదే: బన్నీ

Sun Nov 28 2021 09:04:04 GMT+0530 (IST)

Allu Arjun In Akhanda Pre Release Event

'అఖండ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "ఈ రోజున నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి .. అల్లు ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఇప్పటిది కాదు. రామారావుగారు ..  మా తాతయ్య కాలం నుంచి ఆ అనుబంధం ఉంది. మా నాన్నగారు .. బాలకృష్ణ గారు ఒకే జనరేషన్ నుంచి మొదలైన వ్యక్తులు. నేను చిరంజీవిగారు .. బాలకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగినవాడిని. అలాంటి నేను ఈ రోజున బాలకృష్ణగారి సినిమా ఫంక్షన్ కి రావడం చాలా ఆనందంగా ఉంది.బోయపాటి శ్రీనుగారు తన ఫస్టు సినిమా చేయడానికి ముందు నుంచే నాకు పరిచయం. ముందుగా ఆయన నాకు 'భద్ర' కథ చెప్పారు. కానీ నేను 'ఆర్య'తో బిజీగా ఉండటం వలన ఆ సినిమా  చేయలేకపోయాను. ఆయన పెద్ద డైరెక్టర్ అవుతాడనే నమ్మకం నాకు అప్పటి నుంచే ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ డైరెక్టర్ అయ్యేవరకూ నేను ఆయనను చూస్తూనే ఉన్నాను. ఆయన అలా అంచలంచెలుగా ఎదుగుతూ ఉంటే నాకు చాలా అందంగా ఉంటుంది. అలాగే నేను ఎదుగుతూ ఉండటం కూడా ఆయనకి అంతే ఆనందం కలుగుతుందని నాకు తెలుసు.

నన్ను బాగా ఇష్టపడేవారిలో బోయపాటి ఒకరు. ఆయన ఎప్పుడు ఎదురైనా మనిద్దరం కలిసి ఒక మంచి సినిమాను చేయాలండి అనేవాడిని. మంచి సినిమా కాదు బాబూ .. మెట్టేక్కే సినిమా చేయాలి అనేవారు. నిజంగానే అలాంటి సినిమాను 'సరైనోడు'తో నాకు ఇచ్చారు. అది నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక బోయపాటిగారు - బాలకృష్ణగారి కాంబినేషన్ గురించి నేను కొత్తగా ఏమీ చెప్పనక్కర లేదు. 'సింహా'తో స్టార్ట్ చేశారు .. 'లెజెండ్'తో పెరిగింది .. .. 'అఖండ'తో అన్ స్టాపబుల్ గా ఉందనే విషయం అర్థమవుతోంది.

ఈ సినిమా ట్రైలర్ చూడగానే నాకు వండర్ఫుల్ గా అనిపించింది. ట్రైలర్ చూసిన వెంటనే నేను బోయపాటిగారికి కాల్ చేశాను. అద్భుతంగా ఉంది .. పూనకాలు తెచ్చేదిలా ఉంది అని చెప్పాను. ఎన్ని పేజీల డైలాగులైనా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఒక రేంజ్  లో చెప్పడమనేది బాలకృష్ణగారికి మాత్రమే కుదిరిన విషయం. రామారావుగారి తరువాత అంత గొప్పగా డైలాగులు బాలకృష్ణ గారు మాత్రమే చెప్పగలరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బాలకృష్ణ గారు రీల్ లో అయినా రియల్ లో నైనా ఎప్పుడూ రియల్ గానే ఉంటారు. అదే ఆయనలో నాకు నచ్చే అంశం" అని చెప్పుకొచ్చాడు.