రాజమండ్రిలో రచ్చ చేయడానికి రెడీ అయిన బంగార్రాజులు..!

Mon Jan 17 2022 20:15:49 GMT+0530 (IST)

All set for Bangarraju blockbuster meet

'మనం' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషనల్ లో తెరకెక్కిన చిత్రం ''బంగార్రాజు''. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సోషియో ఫాంటసీ ఔట్ అండ్ ఔట్ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లో 50 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.''బంగార్రాజు'' చిత్రం మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా.. 2022లో యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా నిలిచింది. విజయానందంలో ఉన్న మేకర్స్ ప్రేక్షకులతో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అయ్యారు. ముందుగా రేపు (జనవరి 18) రాజమండ్రిలో బ్లాక్ బస్టర్ మీట్ ను జరుపుకోనున్నట్లు ప్రకటించారు. చిత్ర బృందం అంతా పాల్గొనే ఈ వేడుక మంగళవారం సాయంత్రం వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ లో జరగనుంది.

కాగా 'బంగార్రాజు' సినిమాలో నాగార్జున బంగార్రాజుగా కనిపించగా.. ఆయన మనవడు చిన బంగార్రాజుగా నాగచైతన్య మెరిశారు. ఇందులో నాగ్ కు జోడీగా రమ్య కృష్ణ.. చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటించారు. నాగబాబు - రావు రమేష్ - సంపత్ - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ - ప్రవీణ్ - అనిత చౌదరీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఫరియా అబ్దుల్లా - దక్షా నగర్కార్ - వేదిక ప్రత్యేక గీతాల్లో సందడి చేసారు.

'బంగార్రాజు' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ చేశారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ లక్ష్మణ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసారు. ఇప్పటికే అర కోటికి పైగా గ్రాస్ వసూలు చేసిన అక్కినేని హీరోల సినిమా.. రాబోయే రోజుల్లో ఎలాంటి పెద్ద చిత్రం విడుదల లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.