Begin typing your search above and press return to search.

'థియేటర్స్ ఓపెన్ చేసినా ఓటీటీల హవా తగ్గదు.. ఆహా కోసం మెగాస్టార్‌ ని సంప్రదిస్తున్నాం'

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:15 PM GMT
థియేటర్స్ ఓపెన్ చేసినా ఓటీటీల హవా తగ్గదు.. ఆహా కోసం మెగాస్టార్‌ ని సంప్రదిస్తున్నాం
X
కరోనా పుణ్యమా అని దేశ వ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీల హవా పెరిగింది. భవిష్యత్‌ లో ఓటీటీల ప్రభావాన్ని ఊహించి ముందే ఓటీటీలోకి ప్రవేశించారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. వంద శాతం తెలుగు యాప్ అంటూ 'ఆహా' ఓటీటీని క్రియేట్ చేశారు. కాగా ఆహా ఆగస్టు బ్లాక్ బస్టర్‌ సెలబ్రేషన్ సందర్భంగా 'ఆహా' లో ఈ నెలలో విడుదలయ్యే సినిమాలు, షోల గురించి వివరించడానికి అల్లు అరవింద్‌ అండ్‌ టీమ్‌ మీడియాతో మాట్లాడారు. ''ఫిబ్రవరి 8న ప్రారంభించిన ఆహా యాప్‌ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు దాదాపు 40 లక్షల డౌన్‌ లోడ్లు అయ్యాయి. 6 నెల‌ల కాలంలో ఆహా కంటెంట్ ఎలా ఉంద‌ని సెర్చ్ చేసిన వాళ్ల సంఖ్య కోటి ఇర‌వై ల‌క్ష‌లకి చేరింది. ఏడాదిన్న‌ర కాలంలో రీచ్ అవుతామ‌నుకున్న దాన్ని ఆరు నెల‌ల కాలంలోనే రీచ్ అయిపోయాం. వ‌చ్చే ఏడాది ఇదే స‌మ‌యానికి రెండు మూడు రెట్లు ప్రేక్ష‌కులు ఆహా యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకుంటారని భావిస్తున్నాం'' అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

ఇక భవిష్యత్తులో థియేటర్లు తెరిస్తే ప్రజలు ఓటీటీని చూస్తారా అని అడిగితే... ''ఓటీటీ ప్రజలకు బాగా చేరువైపోయింది. అందులో ఇచ్చే కంటెంట్‌ ను బాగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టి థియేటర్లు రీ ఓపెన్ చేసినా ఓటీటీలని పక్కన పెట్టేస్తారనుకోవడం లేదు'' అని అల్లు అరవింద్ సమాధానం ఇచ్చారు. ''ప్ర‌తి క‌థ‌ను తెర‌పైకి తీసుకురాలేం. కానీ 'ఆహా' లాంటి ఓటీటీ వ‌ల్ల నిర్మాత‌గా ఎక్కువ కాన్సెప్ట్‌ ల‌ను అందించే అవ‌కాశం క‌లుగుతుంది. ఎప్ప‌టికైనా సినిమాను మించింది లేదు. ప్రేక్ష‌కుడికి థియేట‌ర్‌ లో కూర్చున్న‌ప్పుడు ఓ అద్భుత‌మైన ఫీలింగ్ క‌లుగుతుంది. థియేట‌ర్స్ ఓపెన్ అయితే ఓవ‌ర్ ఫ్లో ఉండ‌దు కానీ.. వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత ఫ్లో పెరుగుతుంది. ఆగస్టు నెల‌లో స్వాతంత్ర్య దినోత్స‌వం వినాయ‌క చ‌వితి పండ‌గ‌లు ఉన్నాయి. కాబ‌ట్టి 'ఆహా'లో దీన్ని ఫెస్టివ‌ల్ నెల‌గా ప్ర‌క‌టించాం. ద‌స‌రా సంద‌ర్భంలోనూ ఫెస్టివ‌ల్ నెల‌ను ప్ర‌క‌టిస్తాం'' అని తెలిపారు.

అంతేకాకుండా ''థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటీటీలో కంటెంట్ ని కొనసాగిస్తాం. ఇప్పటికే చాలా షోలు రెడీ చేస్తున్నాం. యాంకర్ సుమతో ఆల్ ఈజ్ వెల్ షో సిద్ధమైంది. టాలీవుడ్‌ లో నలుగురు అగ్ర దర్శకులతో భారీ షోలను ప్రారంభించబోతున్నాం. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. వాటిని కొనసాగిస్తూనే కొత్తవి తీసుకొస్తాం. భవిష్యత్తులో ఓటీటీలు థియేటర్స్ సమాంతరంగా నడుస్తాయి'' అని అన్నారు. ''ఓటీటీ అనేది సరికొత్త సంచలనం. శాటిలైట్‌ కు భిన్నంగా వెబ్ మీడియా బలపడుతున్నది. ప్రస్తుతం ఆహా కోసం 42 షోస్ ప్లానింగ్‌ లో ఉన్నాయి. సెప్టెంబ‌ర్‌ లో ఎక్కువ శాతం షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. రెండు మూడేళ్ల‌లో పెద్ద పెద్ద స్టార్స్ ఓటీటీలోకి అడుగుపెట్టే అవ‌కాశాలున్నాయి. 'ఆహా' కోసం మెగాస్టార్‌ చిరంజీవితో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. ఆయ‌న‌కు కాన్సెప్ట్ న‌చ్చితే చాలు'' అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.