Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నుంచి ఖిలాడీ ఒక్క‌డే స్పందించాడా?

By:  Tupaki Desk   |   24 Jan 2023 8:00 AM GMT
బాలీవుడ్ నుంచి ఖిలాడీ ఒక్క‌డే స్పందించాడా?
X
సినిమాలపై అనవసరమైన వ్యాఖ్యలను మానుకోవాలని బిజెపి కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన హెచ్చరికపై బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి ఆశించిన స్పంద‌న రాలేదు. ఇంత‌కుముందు ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ బ‌సు మోదీ హెచ్చ‌రిక‌ల‌పై వెంట‌నే స్పందించారు. న‌రేంద్ర మోదీజీ ఇంకా చాలా ముందే ఇలాంటి హెచ్చ‌రిక‌లు చేసి ఉండాల్సింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాటిపోయింద‌ని బ‌సు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు అంత పెద్ద వ్య‌క్తులు స్పందించ‌డం అంటే చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డ‌మేన‌ని ప‌రిస్థితి విష‌మించాక ప్ర‌ధాని స్పందించార‌ని అనురాగ్ వ్యాఖ్యానించారు.

అనురాగ్ త‌ప్ప అంతగా సినీపెద్ద‌లెవ‌రూ స్పందించ‌లేదు. బాలీవుడ్ లో చోప్రాలు.. ఖాన్ లు.. క‌పూర్ లు ఎవ‌రూ దీనిపై స్పందించిందే లేదు. ఇక సంజ‌య్ లీలా భ‌న్సాలీ లాంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ద్మావ‌త్ సినిమా విష‌యంలో ఎంతో ఇబ్బంది ప‌డ్డారు. చివ‌రికి అత‌డిపైనా కొంద‌రు సాంప్ర‌దాయ మిత‌వాదుల‌ దాడి కూడా జ‌రిగింది. కార‌ణం ఏదైనా కానీ మోదీజీ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న కూడా ఎంత‌మాత్రం స్పందించ‌లేదు.

కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు అక్షయ్ కుమార్ ప్రధాని మోదీ వైఖరిని ప్రశంసించారు. తన త‌దుప‌రి చిత్రం 'సెల్ఫీ' ట్రైలర్ లాంచ్ సందర్భంగా PM మోడీ వ్యాఖ్యలపై అక్షయ్ ను మీడియా అభిప్రాయం కోర‌గా అతడు ఇలా అన్నాడు.

పాజిటివిటీకి ఎల్లప్పుడూ స్వాగతం. మన ప్రధాని పాజిటివ్ గా మాట్లాడారు. మోదీజీ భారతదేశంలోనే అత్యంత‌ ప్రభావశీలుడు. వారు ఏదైనా చెబితే పరిస్థితులు మారితే అది పరిశ్రమకు గొప్పగా స‌హ‌క‌రిస్తుంది. ఈ స‌న్నివేశం మారాలి.. ఎందుకంటే మేమంతా చాలా కష్టపడుతున్నాం'' అని అక్ష‌య్ అన్నారు. మేం సినిమాలు తీస్తాం. సెన్సార్ బోర్డ్ కి వెళ్తాము. అక్క‌డ ఆమోదం పొందాక రిలీజ్ కి వెళుతున్నప్పుడు ఎవ‌రికి ఏ అభ్యంత‌రం? కానీ ఇప్పుడు మ‌న ప్ర‌ధాని వారికి సూటిగా విష‌యం అర్థ‌మ‌య్యేలా చెప్పినప్పుడు ఈ ప‌రిణామం మ‌నంద‌రికీ మంచిది'' అని కూడా పేర్కొన్నాడు. అయితే మోదీ స్పంద‌న ఆల‌స్య‌మైంద‌ని అక్కీ ఎక్క‌డా విమ‌ర్శించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

బాలీవుడ్ ను బహిష్కరించండి! అనే ట్రెండ్ ఇటీవ‌ల‌ భారతీయ చిత్ర పరిశ్రమను వెంటాడుతోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దిగ్భ్రాంతికరమైన మరణం తర్వాత బాలీవుడ్ ను బాయ్‌కాట్ చేయండి! అనే హ్యాష్ ట్యాగ్ గూగుల్ ట్రెండ్స్ లో ప్రారంభమైంది. దీనివ‌ల్ల అమీర్ 'లాల్ సింగ్ చ‌డ్డా'.. అక్ష‌య్- 'పృథ్వీరాజ్'..'రక్షా బంధన్' .. దేవ‌ర‌కొండ -లైగర్ స‌హా ఇంకా చాలా సినిమాలు ఇబ్బందుల్లో ప‌డ్డాయి. బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ ఫ‌లితాలను చూడ‌టానికి ఇలాంటి నెగెటివిటీ నూరిపోయ‌డం ఒక కార‌ణ‌మ‌ని ట్రేడ్ విశ్లేషించింది.

ఈ వ్య‌తిరేక‌త‌ను రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర- పార్ 1' కొంత‌వ‌ర‌కూ త‌ట్టుకోగలిగింది. ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్ల‌ను సాధించింది. ఈసారి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ -దీపికా పదుకొనే న‌టించిన 'పఠాన్'తో మ‌రోసారి అదే ట్రెండ్ తిరిగి ఆందోళ‌న పెంచుతోంది. డిసెంబర్ 12న 'బేషరమ్ రంగ్' పాటను అధికారికంగా లాంచ్ చేసిన కొద్ది గంట‌ల్లోనే ఇబ్బందులు మొదలయ్యాయి.

ఈ పాటలో దీపిక పదుకొణె కుంకుమ రంగు బికినీ అభ్యంతరకరంగా ఉంద‌ని మితవాద గ్రూపులు వాదించాయి. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలువురు భాజ‌పా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇండోర్ లో కొంతమంది కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సినిమా తారల దిష్టిబొమ్మలకు నిప్పు పెట్టారు. ఇలాంటి ప‌ర్య‌వ‌సానాల నుంచి బాలీవుడ్ బ‌య‌ట‌ప‌డాలంటే నేరుగా ప్ర‌ధాని మోదీనే క‌లుగజేసుకోవాల్సి వ‌చ్చింది. మోదీజీ ప్ర‌క‌ట‌న‌తో ఇక‌నైనా ఇలాంటి నెగెటివిటీకి స్వ‌స్థి ప‌లుకుతారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.